ప్రతినిధులుగా మైసూరా, మహేందర్

హైదరాబాద్, 27 డిసెంబర్ 2012:

తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ ఈ నెల 28న నిర్వహించనున్న అఖిలపక్ష సమాశానికి హాజరయ్యే ప్రతినిధుల పేర్లను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రకటించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డితో పాటు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కెకె మహేందర్ రెడ్డి శుక్రవారం జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

     ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో కెకె మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై వైయస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీలో అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి పార్టీ వైఖరిని స్పష్టం చేశారన్నారు. అఖిలపక్ష సమావేశంలోనూ అదే విషయాన్ని చెపుతామన్నారు. తెలంగాణ ఇచ్చే శక్తి, అడ్డుకునే శక్తి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని, తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని పార్టీ ఆవిర్భావం నుంచి చెపుతున్నామన్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ చెపుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ అంశంపై గతంలోనూ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్నారని కెకె మహేందర్ రెడ్డి అన్నారు.  శ్రీకృష్ణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకుని కూడా కేంద్రం ఏటూ తేల్చలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇపుడు కూడా కంటి తుడుపు చర్యగా అఖిలపక్షం ఏర్పాటు చేశారన్నారు. ఎఫ్‌డీఐ గండం నుంచి గట్టెక్కడంతోపాటు పార్టీ ఎంపీలను దూరం చేసుకోలేక కేంద్ర ఆడుతున్నడ్రామాగా పేర్కొన్నారు.

     అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం అందిందని, మొదట ఆ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏంటో చెప్పకుండానే దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. అవగాహన కోసమే అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటనతోనే అఖిలపక్ష సమావేశానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోందన్నారు.

Back to Top