ఎంపీ పొంగులేటి హాస్టల్ నిద్ర

మధిర: ఖమ్మం ఎంపీ, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధిరలోని గిరిజన బాలుర వసతిగృహంలో ఆదివా రం రాత్రి విద్యార్థులతో కలసి నిద్రించారు. విద్యార్థులకు సరైన వసతులు సమకూరుతున్నాయో లేదో తెలుసుకునేందుకే తాను హాస్టల్ నిద్ర చేసినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వసతిగృహ విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు అందుతున్న ఆహారపదార్థాలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నానని తెలిపారు. గతం లో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పర్యటించానన్నారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగక తప్పదన్నారు.
Back to Top