ఎన్టీఆర్‌ అరిశెలు..బాబు పూర్ణాలు..లోకేష్‌ పప్పు

  • వైయస్‌ జగన్‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలి
  • నిరూపించకపోతే లోకేష్‌ క్షమాపణ చెప్పాలి
  • కులాలను, కుటుంబాలను కించపరిచే విధంగా లోకేష్‌ స్పీచ్‌
  • అభివృద్ధిని అడ్డుకునే చరిత్ర టీడీపీది. ప్రతిపక్షం అడ్డుకుంటుందనడానికి సిగ్గుండాలి..?
  • రైతుల కన్నీళ్లపై పండుగ చేసుకుంటున్న చంద్రబాబు సర్కార్‌
  • విశాఖలో ఎన్టీఆర్‌ అరిశెలు, చంద్రబాబు పూర్ణాలు, లోకేష్‌ పప్పూమామిడికాయ
  • ఎన్టీఆర్‌ కుటుంబీకులను పార్టీ నుంచి దూరం చేసి విజయోత్సవ సభ
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
హైదరాబాద్‌: మహానాడు వేదికగా ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి డిమాండ్‌ చేశారు. మీ తండ్రి చంద్రబాబు పాలనలో ఎలువంటి అవినీతి జరగలేదని, అవినీతి రహిత పరిపాలన సాగుతుందని మీకు నమ్మకం ఉంటే... వెంటనే వైయస్‌ఆర్‌ సీపీ ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీ వేసుకోవాలని సవాలు విసిరారు. అభివృద్ధికి ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అడ్డుపడుతున్నారన్న లోకేష్‌ మాటలపై పార్థసారధి విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...లోకేష్‌ స్పీచ్‌ వింటే మహాభారతంలోని ఉత్తర కుమారుడి ప్రగల్భాలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. వారి ప్రభుత్వం, వారి కుటుంబం ఉన్నతమైనదిగా.. ఎదుటి కుటుంబాలని కించపరిచే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. లోకేష్‌ కులాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశ్యంతో ఉన్నారని పార్థసారధి ఆరోపించారు.  కడప సమావేశంలో కులపిచ్చి, మతపిచ్చి, అవినీతి పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీయేనని మీ మనస్సులో ఉన్న మాటను బయటపెట్టిన సంగతి మరిచారా అని చురకంటించారు. 

మీ చేతగాని, దద్దమ్మ తనాన్ని చూపించుకోలేక ఆరోపణలా..?
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిల గురించి మాట్లాడి గొప్పవాడినయ్యానని అనుకోకు లోకేష్‌ అని పార్థసారధి ఎద్దేవా చేశారు. వోక్స్‌వ్యాగెన్, పరిటాల రవి హత్య కేసులో, ఔటర్‌ రింగ్‌ రోడ్డులో అవినీతి జరిగిందని మీరు ఆరోపిస్తే వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేసుకున్న దమ్మున్న నాయకుడు వైయస్‌ఆర్‌ కొనియాడారు. నిజంగా వైయస్‌ జగన్‌ అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే మీ మాటలపై మీకు నమ్మకం ఉంటే దాన్ని నిరూపించాలని సవాలు విసిరారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రజలకు, వైయస్‌ జగన్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. రాయలసీమకు నీరు ఇవ్వాలని గతంలో వైయస్‌ఆర్‌ ఆలోచన చేస్తే విజయవాడలో నిరాహారదీక్షలు చేసింది  మీరు కాదా.. కాల్వలు కూడా పూర్తి కానివ్వకుండా రైతులతో కేసులు వేయించింది వాస్తం కాదా అని చంద్రబాబును నిలదీశారు. ఇటువంటి చరిత్ర పెట్టుకొని వైయస్‌ జగన్‌ అడ్డుపడుతున్నాడానికి సిగ్గుండాలన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు దమ్మూ, ధైర్యం ఉంటే అమరావతి, పోలవరం వెళ్దాం.. ఎక్కడైనా జరగాల్సిన అభివృద్ధి జరిగిందా.. అని పరిశీలిద్దాం రండి అని చాలెంజ్‌ విసిరారు. మీ చేతగాని, దద్దమ్మ తనాన్ని చూపించుకోలేక ఎన్నికల్లో ఏమీ చేయలేమని తెలిసి వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్‌ ఆశయ, సిద్ధాంతాలను భ్రష్టుపట్టించిన బాబు
రాష్ట్రంలో రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి దుఖాలపై చంద్రబాబు పార్టీ మహానాడు పేరుతో పండుగ చేసుకుంటుందని పార్థసారధి విమర్శించారు. ఎక్కడైనా రాజకీయ పార్టీ సమావేశం పెడితే ప్రజలకు మంచి సందేశాలు పంపించాలి కానీ మహానాడులో రైతులు ఇబ్బందుల్లో ఉన్నా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోయినా.. విశాఖలో ఎన్టీఆర్‌ అరిశెలు, చంద్రబాబు పూర్ణాలు, లోకేష్‌ పప్పూ మామిడికాయ, 42 రకాల ఐటమ్స్‌తో బ్రహ్మాండంగా తిరునాళ్లు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించేది మహానాడు కాదని, అది మహా విజయోత్సవ సభ అని పార్థసారధి ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి భూస్థాపితం చేసిన తరువాత ఆయన కుటుంబానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా వేదికపై లేకుండా చేశామని విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ ఆశయాలను, సిద్ధాంతాలను చంద్రబాబు భ్రష్టుపట్టించాడని మండిపడ్డారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి, కేసులు నుంచి బయటపడేందుకు రాష్ట్ర హక్కులను చంద్రబాబు కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. తెల్ల రేషన్‌ కార్డు మీద పేదవాడి కడుపు నింపుకోవడానికి కొన్ని సరుకులు ప్రభుత్వం ఇవ్వాలి కానీ పేదవాడికి ఇచ్చే 9 సరుకుల్లో ఎనమిదీటికి ఎగనామం పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. 
Back to Top