పార్టీ బలోపేతానికి కృషిచేయండి : కడపల

నల్లమాడ:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పుట్టపర్తి నియోజకవర్గ వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వంకరకుంటలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు, గ్రామానికి చెందిన వంద కుటుంబాల వారు ఆదివారం పార్టీలో చేరారు. పార్టీ పంచాయతీ కన్వీనర్ ఓబిరెడ్డి, నాయకుడు కె. రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, డాక్టర్ నాగేంద్రకుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, డాక్టర్ నాగేంద్రకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వంకరకుంట టీడీపీకి పట్టున్న గ్రామమనీ, ఈ గ్రామంలోని కాంగ్రెస్, టీడీపీ నాయకులు పార్టీలో చేరడం హర్షణీయమనీ పేర్కొన్నారు. మహానేత తనయ షర్మిల జిల్లాలో చేపట్టిన 18 రోజుల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు విశేష స్పందన లభించిందనీ, దీంతో పార్టీపై ప్రజలు మరింత అభిమా నం కురిపిస్తున్నారనీ చెప్పారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్, టీడీపీ చేసిందేమీ లేదని వారు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ మండల కన్వీనర్ పొరకల రమణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Back to Top