'పాలేరు షుగర్సు'పై జగనన్న సమీక్షిస్తారు


నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా),
24 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పాలేరు షుగర్ ఫ్యాక్టరీ అక్రమా‌లపై సమీక్ష చేస్తారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. షుగర్ ఫ్యాక్టరీలోని రైతుల షే‌రుధనాన్ని వారికి తిరిగి చెల్లిస్తారని భరోసా ఇచ్చారు. అందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని ఆమె హెచ్చరించారు. వంద కోట్ల రూపాయల విలువైన పాలేరు షుగర్ ఫ్యాక్టరీని చంద్రబాబు 9 కోట్ల రూపాయలకే ఎం‌.పి. నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టేశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలకు చంద్రబాబు రూపాయి వడ్డీ రుణాలు ఇస్తే, మహానేత డాక్టర్ వై‌యస్ పావలా వడ్డీకే రుణాలిచ్చారని‌ ఆమె గుర్తుచేశారు.

మహానేత వైయస్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకం ద్వారా లక్షలాది‌ మంది పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు. అయితే, ఆయన ప్రవేశపెట్టిన పథకాలకు ప్రస్తుత సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. మూడు సార్లు ఆర్టీసీ, నాలుగు సార్లు ఎరువుల ధరలు పెంచారని ఆవేదన వ్యక్తంచేశారు. రిజిస్ట్రేషన్, కరెంట్ చార్జీల పెంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులుండదన్నారు. చంద్రబాబుకు పట్టిన గతే కిర‌ణ్‌కూ పడుతుందని శ్రీమతి షర్మిల హెచ్చరించారు.

గ్రామాలలో బెల్టు షాపుల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని శ్రీమతి షర్మిలకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక మహిళలు మొరపెట్టుకున్నారు. జగనన్న సిఎం అయితే బెల్టు షాపులను రద్దు చేస్తారని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్ ఇస్తున్నారని, చీకట్లో పొలాలకు వెళ్తున్న తమ భర్తలకు ఏమవుతుందోనని మహిళలు ‌ఆందోళన వ్యక్తం చేశారు. జగనన్న అధికారంలోకి వస్తే రైతులకు మెరుగైన కరెంట్ అందిస్తారని‌ శ్రీమతి షర్మిల వారకి హామీ ఇచ్చారు.
Back to Top