ఆ పార్టీలతో మేం వేదిక పంచుకోలేం

హైదరాబాద్, 21 డిసెంబర్ 2013:

విలువలు, విశ్వసనీయత ఉన్న రాజకీయాలను అనుసరించే పార్టీగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ రెండు పడవల మీద ప్రయాణం చేయడాన్ని వ్యతిరేకిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుకు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టంచేశారు. సమైక్య వాదానికి మనసా వాచా కర్మణా కట్టుబడి కాంగ్రెస్, టీడీపీలతో కలిసి వేదికను పంచుకునేందుకు తాము సిద్ధంగా లేమని ఆయన అశోక్‌బాబుకు శుక్రవారం రాసిన లేఖలో స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు తీర్మానాలు చేసి, లేఖలు ఇచ్చి, వెనక్కి తీసుకునేది లేదంటున్న ఆ పార్టీలతో కలిసి వేదిక మీదకు మేం రాలేం అన్నారు.

సమైక్యాంధ్ర కోసం శనివారంనాడు హైదరాబాద్‌లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆహ్వానించినందుకు మైసూరారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజనను స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకూ తావు లేకుండా తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న పార్టగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు ఒక విధానం ఉందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 70 -75 శాతం ప్రజల ఆకాంక్ష సమైక్య వాదాన్ని. ప్రజల వాణిని దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ పక్షాలకు వినిపించడంలో వైయస్ఆర్‌సీపీ ముందుందన్నారు. పార్లమెంటులో సైతం మద్దతు కూడగట్టడంలో వైయస్ఆర్‌సీనీ పోషిస్తున్న పాత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్ర విభజనకు చెడిపోయిన రాజకీయాలు.. ఓట్లూ, సీట్ల ప్రాతిపదికలు కారణం అని అన్ని ప్రాంతాల వారూ గుర్తించారన్నారు.

సమైక్య వాదానికి కట్టుబడిన పార్టీలను, ఆయా పార్టీల అధ్యక్షులను మాత్రమే మీరు ఆహ్వానించి ఉంటే.. భుజం భుజం కలిపి నడవడానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని తన లేఖలో మైసూరా తెలిపారు. అలాంటి సమావేశంలో పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ స్వయంగా పాల్గొంటారని పేర్కొన్నారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు, సమైక్య వాదం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని అశోక్‌బాబుకు రాసిన లేఖలో మైసూరా తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top