ముందుచూపు లేకే విద్యుత్‌ సంక్షోభం: షర్మిల

కర్నూలు, 12 నవంబర్‌ 2012: ప్రస్తుత రాష్ట్రప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి ముందుచూపు లేని కారణంగానే మన రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదని షర్మిల తూర్పారపట్టారు. వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర 29వ రోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతున్నది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె పాదయాత్రగా చిన్నకడుబూరు చేరుకున్నారు. అక్కడ ఆమె మహిళలతో సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. కేవలం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిర్లక్ష్యమే రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సమస్యకు కారణమని నిప్పులు చెరిగారు.

దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య రానివ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవారని గుర్తుచేశారు. సమస్యలను ముందుగానే పసిగట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆయన దృష్టి సారించేవారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను ఆయన సంక్షోభం తలెత్తక ముందే కొనుగోలు చేసి ఉంచేవారన్నారు. ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆయన మాదిరిగా ముందుచూపు లేకపోయిందని దుయ్యబట్టారు. విద్యుత్‌ సంక్షోభం ముంచుకు వస్తుందని తెలుస్తున్నా కిరణ్‌ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ హయాంలో విద్యుత్‌ సమస్యలు తలెత్తలేదన్నారు. ఒక వైపున విద్యుత్‌ సరఫరా సరిగా చేయలేకపోతున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మరో వైపున నిరుపేదలు, సామాన్యులపైన కొత్తగా పన్నులు, అదనపు విద్యుత్‌ బిల్లులు వేసి నడ్డి విరుస్తోందని నిప్పులు చెరిగారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 20 లక్షల పక్కా ఇళ్ళు నిర్మించారని షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే సమయంలో దేశం మొత్తంగా 45 లక్షల పక్కా ఇళ్ళ నిర్మాణం జరిగిన వైనాన్ని వెల్లడించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో ఇళ్ళు లేని వారికి పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తారని షర్మిల హామీ ఇచ్చారు.
మహానేత జీవించి ఉన్నప్పుడు తమకు ఇచ్చిన విధంగా నెల నెలా పింఛన్లు అందడంలేదని పలువురు మహిళలు ఈ సందర్భంగా షర్మిల ముందు వాపోయారు. వడ్డీ లేని రుణాలకు కూడా ఇప్పుడు వడ్డీ చెల్లించాలని తమను వత్తిడి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి రోజులు త్వరలోనే రానున్నాయని, రాజన్న రాజ్యం కోసం అందరం ఓపికగా వేచి చూద్దామని షర్మిల అన్నారు. జగనన్న సారథ్యంలో రాజన్న రాజ్యం వస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. జగనన్నను మీరంతా ఆశీర్వదిస్తే, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధికారాన్ని అందిస్తే రాజన్నరాజ్యం సాధ్యం అవుతుందన్నారు. రాజన్న రాజ్యంలో మీ సమస్యలు పరిష్కారం అవుతాయని వారికి అభయం ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలకు సహాయం చేయాలన్న గుణం లేదని షర్మిల ఆరోపించారు.

జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటయ్యే రాజన్న రాజ్యంలో పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రవేశపెడతారని మహిళలకు షర్మిల భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా పిల్లలను పాఠశాలకు పంపించే తల్లులకు మద్దతుగా బ్యాంకు ఖాతాలో నేరుగా నెలనెలా డబ్బులు వేస్తారని వివరించారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబంలో ఇద్దరు పిల్లలకు అలా డబ్బుల వేస్తారని చెప్పారు.

షర్మిల పాదయాత్రకు అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. షర్మిల వెంట పాదయాత్రలో వేలాది మంది పాల్గొంటున్నారు.
Back to Top