నిర్బంధంలోనూ జగన్‌ జనం పక్షమే!

న్యూఢిల్లీ :

నిర్బంధంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నిరవధిక నిరాహార దీక్షకు దిగిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన నిలిచిన సిసలైన పోరాట యోధుడని పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభివర్ణించారు. తమకు అండగా నిలిచిన యువనేతకు జనమంతా మద్దతు పలుకుతున్నారని ఆయన అన్నారు. అనాలోచిత, ఆకస్మిక, నిరంకుశ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ను అస్తవ్యస్తం చేసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల ఆందోళనలు, జైలులో శ్రీ జగన్ దీక్షను చూసైనా పునరాలోచన చేస్తుందని భావిస్తున్నానని ‌అన్నారు. న్యూఢిల్లాలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని విభజించాలన్న కేంద్రం నిర్ణయం కారణంగా సీమాంధ్రలో ఎక్కడ చూసినా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఉద్యమిస్తున్నారని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో, అందరి ప్రయోజనాలు పరిరక్షించేలా సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరికీ లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచీ చెబుతూ వస్తోందని, ఇప్పుడూ అదే చెబుతున్నామని మేకపాటి తెలిపారు.

అందరికీ సమ్మతమైన నిర్ణయాన్ని కేంద్రం చేయలేకపోయిందని, దాని ఫలితమే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉధృత పరిస్థితులని రాజమోహన్‌రెడ్డి వివరించారు. కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తును తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింద‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుమని పదిహేను రోజులు జైలులో ఉంటేనే ఏవేవో కుంటి సాకులు చెప్పి ఆసుపత్రిలో చేరడమో లేక బయటికి రావడమో జరుగుతున్న ఈ రోజుల్లో.. 15 నెలలుగా నిర్బంధంలో ఉన్నా మొక్కవోని ధైర్యంతో, లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి సంకల్ప బలం గొప్పదన్నారు. ఆయన పోరాట నైజాన్ని, పటిమను చూసి ప్రజలంతా మద్దతు పలుకుతున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజనకు ‌నడుంకట్టిన కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా, గోదావరి జల సమస్యలు, రాజధాని సమస్యకు పరిష్కారం ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఉందని మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top