మాఫియా రాజ్యాన్ని భూస్థాపితం చేద్దాం

చిత్తూరు:  రాష్ట్రంలో మాఫియా రాజ్యాన్ని భూస్థాపితం చేద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పుంగ‌నూరు ఎమ్మెల్యే డాక్ట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇసుక నుంచి మ‌ట్టి, మ‌ద్యం, ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్‌ చేస్తూ ప్రజాధనాన్ని దోచేస్తున్నార‌ని ఆరోపించారు. పుంగ‌నూరు ప‌ట్ట‌ణంలోని ఆర్‌ఆర్‌ కల్యాణ మండపంలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ముందుగా దివంగత సీఎం డాక్టర్ వైయ‌స్‌.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా  పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని అన్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీకి పాల్పడుతూ ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి పాలనలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, చాంద్‌బాషాలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి మోసగించిందని దుయ్యబట్టారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని చెప్పారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉద్య‌మించాల‌ని, 2019లో పార్టీని అత్య‌ధిక మెజారిటీతో గెలిపించి రాజ‌న్న రాజ్యాన్ని తెచ్చుకుందామ‌ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్‌ తిప్పారెడ్డి, పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్, రెడ్డెప్ప, నాగభూషణం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజారెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.

Back to Top