కాంగ్రెస్‌ది రాజకీయ స్వార్థం : బాలినేని

హైదరాబాద్, 25 జూలై 2013:

రాష్ట్ర విభజన‌పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా రాజకీయంగా తనకు కలిసివస్తుందా? లేదా అని ఆలోచిస్తున్నదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ‌ప్రజల బాగోగులను ఆ పార్టీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఇస్తే ఎన్ని సీట్లు వస్తాయి, రాయల - తెలంగాణ ఇస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనే దృష్టితోనే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తు‌న్నదన్నారు.

ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటోందని బాలినేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వాదాన్ని కాంగ్రె‌స్‌ పార్టీ స్వార్థంతోనే తెరపైకి తెచ్చిందన్నారు. అందరికీ ఆమోదయోగ్య పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన సూచించారు.‌ విభజన విషయంలో ముందుగా కాంగ్రెస్ తన అభిప్రాయం ‌వెల్లడించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top