పేదోడికి ముద్దపెట్టడంలోనూ అవినీతే

చంద్రబాబువి అన్నా క్యాంటీన్లు కాదు.. అల్లుడి క్యాంటీన్లు
మంత్రి నారాయణను ఇరికించేందుకు పన్నాగం
163 క్యాంటీన్లకు రూ. 380 కోట్లు విడుదల చేస్తూ జీఓ
స్థలం, ఇసుక ఉచితం.. చదరపు అడుగు నిర్మాణానికి రూ. 5 వేలా?
మళ్లీ రాజధాని తరహా అవినీతికి చంద్రబాబు శ్రీకారం
పేదవారికి జరిగే అవినీతిపై వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటం చేస్తాం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్‌: పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లలో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాలుగేళ్లుగా ఎన్టీఆర్‌ పేరు వాడకూడదనే ఉద్దేశంతో పని చేసి ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టబోతున్నట్లు ప్రకటిస్తున్నాడన్నారు. చంద్రబాబు పెట్టే అన్నా క్యాంటీన్లు.. అల్లుడి క్యాంటీన్లుగా ప్రజలంతా భావిస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ రాష్ట్ర సంపత్తును, పేదోడి కష్టార్జీతాన్ని దోచుకోవడానికి కొత్తరూపంలో అన్నా క్యాంటీన్లు వాడుకుంటున్నాడన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 380 కోట్లతో క్యాంటీన్లకు కేటాయిస్తున్నట్లుగా జీఓ 121 విడుదల చేశారన్నారు. దాని మూడు భాగాలు చేసి ఒకటి నిర్మాణం, రెండు బ్యూటీఫికేషన్, మూడు సరుకులకు అని చెప్పారన్నారు. 163 క్యాంటీన్లకు సుమారు రూ. 59 కోట్లతో టెండర్లు పిలుస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారన్నారు. 
ఇంకా ఎంతకాలం దోచుకుంటారు..
ఇప్పటికే చంద్రబాబు పాలనలో రాష్ట్రం లూటీ, అవినీతి మయంగా తయారైందని, మళ్లీ ఇప్పుడు నిరుపేదలకు అన్నం పెట్టే క్యాంటీన్‌లలో కూడా దోపిడీకి తెగబడ్డారని ఆర్కే మండిపడ్డారు. ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణానికి సుమారు రూ. 36 లక్షల కేటాయిస్తున్నారని, అంటే 750 చదరపు అడుగుల క్యాంటీన్‌కు ఒక్క అడుగు నిర్మాణానికి 5 వేలు ఇస్తూ డబ్బు దోచుకునేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి తాత్కాలిక భవనాలు కట్టి ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10 నుంచి 12 వేలు కాంట్రాక్టర్‌లకు కట్టబెట్టి వారి నుంచి దోచుకున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల బయట 3 సెం.మీ వర్షం కురిస్తే భవనం లోపల 6 సెం.మీ కురిసే విధంగా డిజైన్‌ చేశాడని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరిగిందో.. మళ్లీ అలాంటి అవినీతిని అన్నా క్యాంటీన్ల పేరుతో చేసేందుకు తెరలేపారన్నారు. క్యాంటీన్లకు స్థలం ఉచితం, ఇసుక ఉచితం, సిమెంట్‌ సబ్సిడీపై ప్రభుత్వమే అందిస్తుంది.. మళ్లీ రూ. 5 వేలు చదరపు అడుగు నిర్మాణానికి ఇస్తూ ఇంకా ఎంతకాలం దోచుకుంటున్నారని ప్రశ్నించారు. 
లోకేష్‌ను తప్పించే ప్రయత్నం..
మంత్రి నారాయణను ఇరికించడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చాడని ఎమ్మెల్యే ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లు కేవలం అర్బన్‌లోనే ఏర్పాటు చేస్తున్నారని, రూరల్‌లో పెడితే.. అది లోకేష్‌ శాఖకు వెళ్తుందన్నారు. రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ల అవినీతిపై ఎంక్వైరీలు జరిగితే.. నారాయణ ఇరుక్కుంటారు.. లోకేష్‌ తప్పించుకుంటాడనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి నారాయణ కూడా ఈ విషయాలను గ్రహించాలన్నారు. 
ఎలా పరిపాలించాలో.. వైయస్‌ఆర్‌ను చూసి నేర్చుకో బాబూ
ప్రజలంతా ప్రత్యేక హోదా పోరాటంలో ఉన్నారు.. మనం ఎంత అవినీతి చేసినా పట్టించుకోరనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు చీకటి జీఓలు విడుదల చేస్తున్నారని ఆర్కే మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వదిలిపెట్టదని, వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పేదవాడికి జరిగే ప్రతి అన్యాయాన్ని ఎదిరించి తీరుతామన్నారు. పరిపాలన ఎలా ఉండాలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. సంవత్సరం క్రితం మంగళగిరి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాజన్న క్యాంటీన్‌ తానే స్వయంగా ఏర్పాటు చేశానని ఆర్కే చెప్పారు. రోజు ఆ దారిలో వెళ్తున్న చంద్రబాబు క్యాంటీన్‌ను చూసి తలదించుకుంటున్నాడని, కేవలం నాలుగు రూపాయలకు పౌష్టికాహారం అందిస్తున్నానన్నారు. కనీసం అది చూసైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకుంటాడనుకుంటే తీరు మార్చుకోవడం లేదన్నారు. ఎలుక తోలు తెచ్చి.. ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు.. అన్న వేమన శతకంలోని పద్యం మాదిరిగా చంద్రబాబు తీరుందన్నారు. బాబు లాంటి మనుషుల కోసమే వేమన ఈ పద్యం రాశాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top