మంత్రుల్ని ఎందుకు అరెస్టు చేయరు?

హనుమాన్‌ జంక్షన్‌ (కృష్ణాజిల్లా), 10 ఏప్రిల్‌ 2013 : సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, అధికారం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఉన్నట్టా లేక సాధారణ ఎంపి శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ఉన్నట్టా? సిబిఐ సమాధానం చెప్పాలని శ్రీమతి షర్మిల నిలదీశారు. జగనన్నను ఎందుకు జైలులో పెట్టినట్టు? సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఈ మంత్రులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ శ్రీమతి షర్మిల సిబిఐని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఈ మంత్రులు అనుకూలస్థులు గనుక వారిని సిబిఐ అరెస్టు చేయదు, శ్రీ జగన్మోహన్‌రెడ్డి వ్యతిరేకించారు గనుక ఆయనను అరెస్టు చేసిందని ఆరోపించారు. ఇది పచ్చి నిజం. ఈ కారణం కాకుండా మరేది చెప్పినా చందమామ కథ వినడానికి ప్రజలు కారని సిబిఐని హెచ్చరించారు. మరో ప్రజాప్రస్థానం 116వ రోజు బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని కొనసాగింది. హనుమాన్‌ జంక్షన్‌ రాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

కాంగ్రెస్‌ చేతిలో సిబిఐ కీలుబొమ్మ అయిపోయిందనడానికి వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించిన వారి మీద సిబిఐ విరుచుకుపడుతుందని ఆరోపించారు. జగనన్న కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండి ఉంటే ఈ పాటీకి ఏ మంత్రో, ముఖ్యమంత్రో కూడా అయిపోయేవారని గులాం నబీ ఆజాద్‌ స్వయంగా అన్నారని శ్రీమతి షర్మిల తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించినందువల్లే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇన్ని అష్టకష్టాలు పడుతున్నారని ఆయన స్వయంగా ఒప్పుకున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించినందుకు జగనన్నను పది నెలలుగా జైలుపాలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న మీద సిబిఐ ఎన్నో ఆరోపణలు చేసిందని, అయితే ఒక్క ఆధారాన్ని కూడా ఈ రోజు వరకూ చూపించలేకపోయిందన్నారు.

ఐదవ ఛార్జిషీట్‌లో ఎ 4 గా హోంమంత్రి సబితారెడ్డిని సిబిఐ చేర్చిందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అంతకు ముందు మరో ఛార్జిషీట్‌లో మరో మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా చేర్చిన వైనాన్ని గుర్తుచేశారు. జగనన్నను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కుట్రలు చేసి, నీచమైన ఆలోచనలు చేసి జైలుపాలు చేశారన్నారు. ఈ పాపం ఊరికే పోదని, ఈ పాపంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఇంతకు ఇంత అనుభవిస్తారని శ్రీమతి షర్మిల అన్నారు. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సిబిఐ వెనకాల దాక్కుని మరీ దాడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50కి పైగా ప్రభుత్వరంగ సంస్థలను ముక్కలుగా చేసి, పప్పుబెల్లాల్లా ఆయన బినామీలకు ఇచ్చుకున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తి అన్నారు. లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చంద్రబాబు తన వాళ్ళకు ఇచ్చేసుకున్నారని దుమ్మెత్తిపోశారు. హనుమాన్‌జంక్షన్‌లోని హనుమాన్‌ సుగర్సుకు కూడా చంద్రబాబు అదే గతి పట్టించారని నిప్పులు చెరిగారు. రైతులు, ప్రభుత్వం భాగస్వామ్యంలో 1971లో ఏర్పాటైన గొప్ప సంస్థ హనుమాన్‌ సుగర్సు అని శ్రీమతి షర్మిల తెలిపారు. ఎంతో బాగా నడుస్తున్న వందల కోట్ల విలువైన ఈ ఫ్యాక్టరీని కేవలం రూ. 11 కోట్లకు చంద్రబాబు తన వాళ్ళకు ఇచ్చేసుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఎంతగా వ్యతిరేకించినా చంద్రబాబు అస్సలు వినలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేలాది మంది రైతులకు షేర్‌ క్యాపిటల్‌ గాని, డివిడెండ్‌ గానీ ఇవ్వకుండా మోసం చేసిన మనిషి చంద్రబాబు అని తూర్పారపట్టారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు.. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిగారి ప్రతి పథకానికి జగనన్న జీవం పోస్తారని తాము ధైర్యంగా చెబుతున్నామన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తన పాలనా కాలంలో చేసిన పనులు చేస్తానని చెప్పాలని శ్రీమతి షర్మిల సవాల్‌ చేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మహానేత పథకాలను తానూ ఇస్తానంటూ చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అవిశ్వాస సమయంలో చంద్రబాబు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రజలకు కరెంట్‌ కష్టాలు వచ్చాయన్నారు. ఎనిమిదేళ్ళలో చంద్రబాబు ఎనిమిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచితే నాలుగేళ్ళలో నాలుగుసార్లు కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా పెంచేసి ప్రజలను కాల్చుకు తింటున్నారని విమర్శించారు.

తెనాలిలో మొన్న మద్యం మత్తులో పడి కొందరు యువకులు యువతిని వేధించడమే కాకుండా అడ్డుకున్న ఆమె తల్లిని లారీ కిందకు తోసి చంపేశారు. మద్యం మత్తులో మన యువత ఎంతాలా చెడిపోతోందో అని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. బెల్టు షాపులను తీసేసి పుణ్యం కట్టుకోమని మహిళలు ప్రాధేయపడుతున్నారు. కానీ సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి అవి కనిపించవని నిప్పులు కక్కారు. గత సంవత్సరం కన్నా 15 శాతం ఎక్కువ మద్యం తాగించాలని కిరణ్‌ కుమార్‌రెడ్డి లక్ష్యం నిర్దేశించారని దుమ్మెత్తిపోశారు. బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వచ్చింది చంద్రబాబు హయాంలోనే అని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

మహాత్మా గాంధీ తమకు ఆదర్శం అని, ఆయన ఆశయాల పునాదుల మీదే కాంగ్రెస్‌ పుట్టిందని చెబుతూనే.. మద్యం మాఫియా డాన్‌ బొత్స సత్యనారాయణను పదవులలో కూర్చోబెట్టడమేమిటని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. మహానేత వైయస్‌ బతికి ఉంటే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఉండేవారన్నారు. కాని ఇప్పటి ప్రభుత్వం‌ కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేక ఆపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. ఆ కొద్దిపాటి కరెంట్‌ను కూడా పొలంలో తేళ్ళు, పాములు తిరిగే రాత్రి సమయంలో ఇస్తోందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ పాలనలో కరెంట్‌ లేకుండానే వండుకోవాలి... చీకటిలోనే పండుకోవాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. లేని కరెంట్‌కు మూడింతలు బిల్లులు మాత్రం వేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

జగనన్న త్వరలో వస్తారని, రాజన్న రాజ్యం వైపు మనందరినీ నడిపిస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. అప్పటి వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచాలని, తమతో కలిసి కదం తొక్కాలని శ్రీమతి షర్మిల రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
Back to Top