మహానేత రాజన్న ఆశీస్సులు తీసుకున్న షర్మిల

ఇడుపులపాయ (వైయస్‌ఆర్‌ జిల్లా), 18 అక్టోబర్‌ 2012: జగన్‌ వదిలిన బాణంలా 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రకు బయలుదేరే ముందు షర్మిల తండ్రి, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. ఇడుపులపాయలోని వైయస్‌ఆర్ ఘా‌ట్ వద్ద తల్లి వైయస్ విజయమ్మ, వదిన వై‌స్ భారతితో కలిసి ఆమె తండ్రి సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.‌

ఉద్విగ్న భరిత వాతావరణంలో సాగిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఘాట్ ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆశీర్వదించిన వేద పండితులు షర్మిలకు కంకణధారణ చేశారు. ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు జరిపి ఆశీర్వదించారు. షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఇడుపులపాయ‌ మహా జనసంద్రమైంది. ఇడుపులపాయ దారులన్నీ కిక్కిరిసిపోయాయి.
Back to Top