మాట తప్పని ఆచారం మా కుటుంబానిది: విమల

ఇడుపులపాయ: షర్మిల పాదయాత్ర విజయవంతమవుతుందనే విశ్వాసం తమకు దేవుడిపై ఉందని మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల చెప్పారు. గురువారం ఇడుపులపాయనుంచి షర్మిల పాదయాత్రకు ఆమె విచ్చేశారు. ఇచ్చిన మాట నెరవేర్చడం తమ కుటుంబ ఆచారమన్నారు. ఆ బాటలోనే జగన్ ఇక్కట్లను ఎదుర్కొంటున్నాడని తెలిపారు. జగన్ తరఫున చేస్తున్న యాత్రలో షర్మిలను కూడా ప్రజలు ఆదరిస్తారన్న ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. ఆమె తండ్రికి తగ్గ తనయ అన్నారు. దేవుడి శక్తితో ముందెకెడుతుందనే నమ్మకముంది. తన అన్నలాగే పిల్లలు కూడా ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారన్నారు. షర్మిల సాహసం చేస్తోందనీ, దేవుడే ఆమెకు శక్తినివ్వాలనీ చెప్పారు. అంతకు ముందు ఆమె వైయస్ఆర్ సమాధికి నివాళులర్పించారు.  ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వానికి మేలుకొలుపేలా యాత్ర సాగాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ వివేకానందరెడ్డి అభిలషించారు. వైయస్ కుటుంబంపై సాగిస్తున్న కుట్రపూరిత వైఖరిని తుత్తునియలు చేయాలన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏ పథకాన్ని పరిపూర్ణంగా అమలు చేయడంలేదని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు.  ఫీ రియింబర్సుమెంటును నీరు గార్చిందన్నారు. వైయస్ పథకాల నీరుగారుస్తున్న అంశంపై ప్రజల స్పందనను చూడాలనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు.  వైయస్ఆర్ పథకాలను అమలు చేయడం,  ఆయన రాజ్యాన్ని తిరిగి తేవడమే లక్ష్యమని కడప జిల్లాకు చెందిన వైయస్ఆర్ సీపీ నేత నాగిరెడ్డి చెప్పారు. ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పునాదులు కదలడం ఖాయమని ఆయన స్పష్టంచేశారు.

Back to Top