కృష్ణా జిల్లాలో 340.8 కిలోమీటర్లు నడిచిన షర్మిల

విజయవాడ, 22 ఏప్రిల్‌ 2013: కృష్ణా జిల్లాలో శ్రీమతి షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర షెడ్యూల్ సోమవారం సాయంత్రంతో పూర్తయింది.‌ కృష్ణా జిల్లాలో ఆమె 27 రోజులు పాదయాత్ర చేశారు. జిల్లాలో మొత్తం 340.8 కిలోమీటర్లు నడిచారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, 23 మండలాలు, 105 గ్రామాల్లో శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగించారు. జిల్లాలో మొత్తం 11 రచ్చబండ కార్యక్రమాలు, 14 బహిరంగసభలు నిర్వహించారు. ఐదు చోట్ల ఆమె గ్రామసభల్లో పాల్గొన్నారు.

కాగా, కృష్ణా జిల్లా మొత్తానికి గుడివాడ నియోజకవర్గంలో శ్రీమతి షర్మిల అత్యధికంగా 20 గ్రామాల్లో పాదయాత్రగా నడిచారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 128వ రోజు సోమవారం నాటికి శ్రీమతి షర్మిల రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 1,729.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తిచేశారు.

2012 అక్టోబర్‌ 18న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి ఉన్న వైయస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి ఆయన ఆశీస్సులతో శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు.

ప్రజా కంటకంగా తయారైన కాంగ్రెస్‌ పార్టీ తీరుకు, దానికి కొమ్ము కాస్తున్న చంద్రబాబు సరళికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున జగనన్న వదిలిన బాణమై శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు జగనన్న ఉన్నారంటూ భరోసా ఇచ్చేందుకు ఆమె తన తండ్రి మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ఈ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.
Back to Top