కాంగ్రెస్ పాలనలో అన్నీ కష్టాలే

ఎల్బీనగర్ (రంగారెడ్డి జిల్లా):దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయని ఆయన తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఆరోపించారు. విద్యుత్తు, ఆర్టీసీ, గ్యాస్ ఇలా అన్ని విభాగాల్లో ధరలు పెంచి ప్రజలపై పెను భారం వేశారన్నారు. పన్నులు పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని శ్రీమతి షర్మిల విమర్శించారు.    
     'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని బీఎన్ రెడ్డి నగర్ వద్ద శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. ఈ అసమర్ధ ప్రభుత్వం వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టడంలేదన్నారు. మహానేత ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిందన్నారు. నిరు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలనే ఉద్దేశంతో మహానేత 'ఫీజు రీయింబర్స్‌మెంట్' పథకం అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ పథకాన్ని తుంగలో తొక్కిందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.

     డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఏ పథకాన్నైనా రంగారెడ్డి జిల్లా నుంచే ప్రారంభించేవారని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాపై మహానేతకు ఉన్న అభిమానం అటువంటిదన్నారు. మహిళలను తన బిడ్డలుగా భావించి వారు ఆత్మగౌరవంతో బతికేలా రుణాలు అందజేశారన్నారు. పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారన్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తామన్న పాలకులు అసలు రుణాలే ఇవ్వడంలేదని విమర్శించారు.

     కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న బయట ఉంటే వారి దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే భయంతోనే అకారణంగా జైలు పాలు చేశారన్నారు. సీబీఐని ఆయుధంగా చేసుకుని కనీసం బెయిల్ కూడా రాకుండా అడ్డుతగులుతున్నారని శ్రీమతి షర్మిల మండి పడ్డారు.  

అన్నదాతలంటే  ఎందుకంత కోపం బాబూ...

     అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతల వెన్నుల్లో వణుకు పుట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు, పాదయాత్రల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. కరవుతో రైతులు అల్లాడుతుంటే కరెంటు బిల్లులు కట్టాలని జైలుకు పంపిన ఘనత ఆయనదన్నారు. బాబు పాలనలో పంటలు లేక, చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటే, పరిహారం కోసమే చేసుకుంటున్నారని బాబు ఎద్దేవా చేశారన్నారు. ఇప్పుడు మేలు చేస్తానంటూ రైతుల దగ్గరకు వెళ్తున్నారని విమర్శించారు. ఆయన పాలనలో రైతులు నరకం చూశారని, ఆ సంఘటనలు రైతన్నలు ఇంకా మరచిపోలేదన్నారు. ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దింపే అవకాశం ఉన్నా, టీడీపీ ముందుకు రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించితే ఆయన పాదయాత్ర చేసే అవసరం ఉండేది కాదన్నారు.

    కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినవారికి సమయం వచ్చినప్పుడు మీరంతా గుణపాఠం చెప్పాలని శ్రీమతి షర్మిల సూచించారు. వారి ఆగడాలు ఎంతో కాలం కొనసాగవని ధైర్యం చెప్పారు. త్వరలోనే జగనన్న వస్తారని, ప్రజల కష్టాలు తీరుస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

    రంగారెడ్డి జిల్లా ఎల్పీనగర్‌లోని బీఎన్ రెడ్డి నగర్ శుక్రవారం సాయంత్రం జనంతో హోరెత్తింది. కిక్కిరిసిన ప్రజలతో సభాప్రాంగణం నిండిపోయింది. బీఎన్ రెడ్డి నగర్ లో రోడ్లు, భవనాలు జనంతో నిండిపోయాయి.

Back to Top