జన ప్రవాహం.. ధర్మవరంలో ఆవిష్కారం

అనంతపురం:

జనం.. జనం.. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా జనమే.. దిక్కులు పిక్కటిల్లేలా.. ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు.. అడుగులో అడుగేస్తూ కదంతొక్కిన జనసందోహం.. ఇదీ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు జిల్లాలో నాలుగో రోజు వచ్చిన జనస్పందన. ఈనెల 18న ఇడుపులపాయలో  ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం నాటికి తొమ్మిదో రోజుకు, అనంతపురం జిల్లాలో నాలుగో రోజుకు చేరుకుంది. గురువారం రాత్రి తుమ్మల శివారులో రోడ్డు పక్కన వేసిన గుడారాల్లో బస చేసిన షర్మిల శుక్రవారం ఉదయం 10.20 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. అక్కడి నుంచి నదిలా ప్రారంభమైన జనప్రవాహం ధర్మవరం చేరుకునే సరికి సముద్రాన్ని తలపించింది. తుమ్మల క్రాస్ నుంచి ధర్మవరం పట్టణానికి చేరుకునే మార్గమధ్యలో రైతులను పలుకరించి మాట్లాడారు. ఆ సందర్భంగా తన వెంట ఉన్న వారెవరూ చేనులోకి వెళ్లొద్దని సూచించారు. వెడితే చేను పాడై రైతు నష్టపోతాడనేది ఆమె ఆందోళన. అందుకే ఆ విధంగా సూచించి తన పరిణతిని ఆమె చాటుకున్నారు. 'వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ కచ్చితంగా వచ్చేది. ఇప్పుడు ఆ ధైర్యం మాకు లేదు. ఏటా అప్పులు చేసి పంట సాగు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు పెంచేసి.. వ్యాపారులకు, దళారులకు లాభం చేకూర్చుతోంది. రైతులను నాశనం చేస్తోంది’ అంటూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అధైర్యపడొద్దనీ.. రాజన్న రాజ్యం వస్తుందనీ. జగనన్న సీఎం అవుతారనీ ఆమె వారికి భరోసా ఇచ్చారు.

Back to Top