ప్ర‌త్యేక హోదా కోసం రాజ‌మండ్రిలో జ‌ల‌దీక్ష‌

రాజ‌మండ్రి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం జ‌ల‌దీక్ష చేప‌ట్టారు. తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి పుష్క‌ర‌ఘాట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్న ప‌ద్ధ‌తిలో నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు జ‌క్కంపుడి రాజా మాట్లాడుతూ..అనైతికంగా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ను ఏపీలో నామ‌రూపాలు లేకుండా చేశామ‌ని, ఇప్పుడు హోదా వ‌ద్ద‌ని చెబుతున్న టీడీపీ, బీజేపీల‌కు అదే గ‌తి ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్‌, దుగ్గిరాజు ప‌ట్నం పోర్టు, క‌డ‌ప‌కు ఉక్కు ప‌రిశ్ర‌మ సాధించ‌డంలో చంద్ర‌బాబు విఫల‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు హోదా కంటే ప్యాకేజీ మిన్న అని గొప్ప‌లు చెప్పుకునే నేత‌ల‌కు ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో హోదా కోసం ఉద్య‌మిస్తామ‌ని చెప్పారు.
Back to Top