జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ కుట్ర: విజయమ్మ

హైదరాబాద్, 09 మే 2013:

అన్ని ప్రాంతాల్లోని తెలుగు ప్రజలూ జగన్ బాబుకు బెయిలొస్తుందని ఆశించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చెప్పారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని నివాసంలో ఆమె గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. సీబీఐ కేంద్రం పంజరంలో చిలకలా మారిపోయిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి నిన్న చేసిన వ్యాఖ్యతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ కలిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడిన పెద్దపెద్ద నాయకులను బెయిలుకు వీల్లేని కేసులు పెట్టారనీ, సుమారు పది లక్షల మందిని జైలులో ఉంచారనీ విజయమ్మ గుర్తుచేశారు. తన మార్కు రాజకీయంతో కర్ణాటకలో బీజేపీని చీలికలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వచ్చిందీ చూశామన్నారు.
కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కలిసి ఎన్నో కుట్రలు పన్నుతున్నాయన్నారు. సంబంధం లేని జగన్ బాబును అరెస్టు చేయడం దీనికో నిదర్శనమన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పాలన ఆదర్శమని కొనియాడిన కాంగ్రెస్ నేతలే నేడు ఆయనను విమర్శించడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. 

పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ అర్థంలేని ఆరోపణలు చేస్తోందని విజయమ్మ ఆరోపించారు.  సీబీఐ పని తీరును సుప్రీంకోర్టే తప్పు పట్టిందని చెబుతూ తాము సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు. కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదని ఆమె స్పష్టంచేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్పై కుట్ర పన్నాయని విజయమ్మ ఆరోపించారు. పార్టీని వీడినందుకే కాంగ్రెస్ కక్ష కట్టిందన్నారు. ప్రజా సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబం ప్రజాసేవకే అంకితమవుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.

అక్కడో మాట, ఇక్కడో మాట చెబుతూ సీబీఐ సుప్రీం కోర్టును తప్పుదోవపట్టిస్తోందని చెప్పారు. 52వ ముద్దాయిగా ఉన్న జగన్ బాబును మొదటి ముద్దాయిగా చేశారని ఆమె ఆరోపించారు. విచారణ కోసమని తీసుకెళ్ళి జగన్ బాబును అరెస్టుచేశారన్నారు. ఉప ఎన్నికల సమయంలో ఆయనను అరెస్టుచేస్తే గెలవచ్చని కాంగ్రెస్ భావించిందన్నారు. సాక్షుల్ని ప్రభావితం చేస్తాడనే జగన్ బాబును అరెస్టు చేశారని అంటూ అధికారంలో లేని జగన్ బాబు ఏరకంగా ఆ పనిచేయగలడని వారు ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏ ఎన్నికలనైనా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని విజయమ్మ స్పష్టంచేశారు.

Back to Top