జగన్‌పై ఏమిటీ ద్వంద్వ వైఖరి?

గుంటూరు, 22 మే 2013:

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. గుంటూరులో ఆయన బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ నేరారోపణ చేస్తే రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఆయన ఉగ్రవాది అనీ, ఆయన్ని వెలివేయాలనీ, ఉరివేయాలనీ వ్యాఖ్యానించారన్నారు. ముఖ్యమంత్రి కూడా ఇలాగే మాట్లాడుతున్నారన్నారు. ధర్మాన ప్రసాదరావు మాటలైనా విని ప్రభుత్వం లోని కాంగ్రెస్ పెద్దలు సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు. మరో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నిన్న ఢిల్లీ వెళ్ళి అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనను కళంకిత మంత్రులలో చేర్చవద్దని కోరారన్నారు. అంటే మిగిలిన మంత్రులు కళంకితులనేది ఆయన ఉద్దేశమా అని అంబటి ప్రశ్నించారు. నేను కళంకితుడిని కాదు మిగిలిన వారు కళంకితులు అనే అర్థం వచ్చేలా మాట్లాడారన్నారు.

ధర్మాన మాదిరిగానే.. నేరారోపణ చేసినంత మాత్రాన నేరస్థులైపోరనీ, వారికి శిక్ష పడినట్లు భావించరాదని కన్నా పేర్కొన్న విషయం తెలిసిందేనన్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిగారికి వర్తించవన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళారు కదా అని పేర్కొన్నారు. కన్నా, సబిత, ధర్మాన.. ఇదే వాదన చెబుతున్నారన్నారు. హైకోర్టులో శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిమీద కేసు పెట్టినప్పుడు ప్రభుత్వం ఇదే వాదన వినిపించాల్సిన తరుణంలో ఉద్దేశపూర్వకంగా తప్పించుకుందని ఆరోపించారు. 26 జీవోల జారీ సమష్టి నిర్ణయమనీ, భూముల కేటాయింపు బిజినెస్ రూల్సు ప్రకారమే జరిగిందనీ, మంత్రివర్గ సమష్టి నిర్ణయమనీ అక్కడ చెప్పి ఉండాల్సి ఉందన్నారు. మరలా ఎందుకు చేయలేదో కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అప్పుడే ప్రభుత్వం ఈ వాదన హైకోర్టులో వినిపించి ఉంటే నేడు ఈ మంత్రులకు ఈ గతి పట్టి ఉండేది కాదని అంబటి అభిప్రాయపడ్డారు. అప్పుడు ఆ వాదన వినిపించి ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి కూడా తప్పుకుపోతారని భావించి చేసిన కుట్ర ఇదన్నారు. శ్రీ జగన్ చేతులొక్కటే కాల్తాయనీ, ఆయనొక్కరినే జైల్లో వేస్తారనీ అనుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. సుప్రీం కోర్టులో సుధాకర్ అనే న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు తదుపరి నోటీసులు అందడంతో ఈ రచ్చ చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన కుటుంబాన్ని వేధించాలనీ, చిందరవందర చేయాలనీ, బజారుపాలు చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా ఇదంతా జరిగిందని గమనించాలన్నారు.

దీనంతటినీ విడిచిపెట్టి ఇప్పుడు మీడియాను దుయ్యబడుతున్నారన్నారు. మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకుంటే అది ఒక మంత్రి తీసుకున్నది కాదనీ, సమష్టి నిర్ణయమనీ ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్పలేదన్నారు. రాజ్యాంగం, లేదా బిజినెస్ రూల్సు చెప్పిన అంశాన్ని పక్కనపెట్టి దివంగత మహానేత రాజశేఖరరెడ్డిగారి మీద బురద జల్లడమో, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి, హింసించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడానికి కుట్ర చేశారని అంబటి ఆరోపించారు

తాజా ఫోటోలు

Back to Top