జగన్ నాయకత్వం అవసరం: మేకపాటి

వింజమూరు: రాష్ట్రంలో రాజన్న పాలన రావాలంటే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎంతో అవసరమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తన సోదరుడైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వింజమూరు మండలం నందిగుంటలో జ్వరపీడితులను పరామర్శించారు. 
గత ఉప ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్‌ సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నిర్బంధం నుంచి బయటపడాలని ప్రజలు తమ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పూజలు, పాదయాత్రలు చేస్తున్నారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తిరిగి రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిని రాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందుకోసమే ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి భారీ మెజారిటీ అందించారన్నారు.
నరసింహకొండకు పాదయాత్ర : ఈ నెల 27వ తేదీన నెల్లూరు నుంచి నరసింహకొండ వరకు 15 కి.మీ పాదయాత్ర చేస్తున్నానని, ఇందులో ప్రజలంతా పాల్గొని నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి జగన్‌మోహన్‌రెడ్డిని నిర్బంధం నుంచి విముక్తుడ్ని చేయాలని ప్రార్థించనున్నామన్నారు. తాను పలువురు న్యాయనిపుణులతో మాట్లాడానని, కచ్చితంగా బెయిల్ వస్తుందని వారు తనకు తెలిపారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలని ఎదురు చూస్తున్నారని, వీరి కోరిక త్వరలో నెరవేరబోతున్నదన్నారు. జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. 
ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నిత్యావసర సరు కుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీనికితోడు ప్రజ లపై ఆర్టీసీ బస్సు చార్జీల మోత, డీజిల్ ధర పెరుగుదల, గ్యాస్ సిలిండర్ల కోతతో ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతున్నదన్నారు. ఈ పరిపాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారన్నారు.
ఇటువంటి ప్రభుత్వాన్ని కూల్చి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితుల అభ్యున్నతికి వైయస్ఆర్‌ సీపీ కట్టుబడి ఉందని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, జీవీ నారాయణరెడ్డి, గణపం రమేష్‌రెడ్డి, గోపిరెడ్డి రమణారెడ్డి, వెలుగోటి రమేష్, ఆనంగి రమణయ్య యాదవ్, తాటిచెట్ల నాగూర్ తదితరులున్నారు. 
వైయస్ పథకాల అమలు జగన్‌కే సాధ్యం: బిక్షపతి
పటాన్‌చెరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి పథకాల అమలు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు నర్రభిక్షపతి అన్నారు. మంగళవారం పటాన్‌చెరులో ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఆయన సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా భిక్షపతి కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో పార్టీ  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, వహీద్ మక్బూల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ వైయస్ పథకాలు అమలు కావాలంటే  జగన్ సీఎం కావాలన్నారు. వైఎస్ఆర్  పాలనలో రైతులు సంతోషంగా ఉండేవారన్నారు.  వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పలువురు కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు. పట్టణ అధ్యక్షుడు కేజీ మహేందర్, జిన్నారం మండల అధ్యక్షుడు ఆంజనేయులు ప్రభుదాస్, జనార్దన రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శక్తివంతమైన నాయకుడు వైయస్
చిన్నశంకరంపేట: దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో శక్తి వంతమైన నేతగా ఎదిగారని, అయితే ఆయన మరణానంతరం ఆ పార్టీ నేతలే మహానేత కుటుంబ సభ్యులను వేధించడం దారుణమని రామాయంపేట మాజీ ఎమ్మెల్యే (కాం గ్రెస్) ఆర్.ముత్యంరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ తర్వాత అంతటి స్థాయిలో ధైర్యంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల కోసం పనిచేసిన ఘనత ఒక్క మహనేతకే దక్కుతుందన్నారు. ప్రజావ్యతిరేక చర్యలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడం కలేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఆలోచన కలిగిన నాయకులు లేరన్నారు. పేద ప్రజలకు మేలు జరగని ప్రభుత్వంలో ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటేనన్నారు. ఎందరో ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని, చాలా వరకు ప్రజలకు సేవలు చేయాలని తాపత్రయ పడేవారేనని తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలనే భవిష్యత్తులో ప్రజలు ఆదరిస్తారని తెలిపారు.
జగన్ నేతృత్వంలో రానున్నది స్వర్ణయుగం
సంగారెడ్డి: రాష్ట్రంలో కొనసాగుతున్న చీకటి పాలన పోయి వైయస్ జగన్ నేతృత్వంలో త్వరలో స్వర్ణయుగం రావటం ఖాయమని వైయస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. వైయస్  జగన్ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి సదాశివపేట మండలం ఆరూర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయం వరకు కొనసాగనుంది. ఆరూర్‌లో పుత్తా ప్రతాప్‌రెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, జిల్లా నాయకులు అం జిరెడ్డి, రఘునాథ్‌రావు, కె. వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్‌రెడ్డితో కలిసి ప్రతాప్‌రెడ్డి, రాఘవరెడ్డి, బట్టి జగపతి తదితర నాయకులు పార్టీ జెండాలను చేతబూని రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రజానాయకుడు వైఎస్ జగన్ జైలు నుంచి బయటకురావాలని కోరుతూ శ్రీధర్‌రెడ్డి పాదయాత్ర చేయటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ దుష్టపాలన కొనసాగుతోందని, దీనిని త్వరలోనే అంతమొందిస్తామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ యువజన విభాగం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యువకులు, మహిళలు పెద్ద ఎత్తున జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ మంత్రి ధర్మానకు బెయిల్ ఇవ్వడం హాస్యాస్పందంగా ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం నోటీసులు ఇచ్చి విచారణకు అనుమతించడం విచారకరమన్నారు. కుట్రలన్నింటినీ పటాపంచలు చేసి వైయస్ జగన్ బయటకు రావటం ఖాయమన్నారు. శ్రీధర్‌రెడ్డి పాదయాత్ర చేయటం అభినందనీయమని, తాను సైతం ఈ పాదయాత్రలో పాల్గొంటున్నట్లు చెప్పారు. పాదయాత్ర చేపట్టిన గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జననేత వైయస్ జగన్ జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ చిలుకూరు బాలాజీకి మొక్కేందుకు ఆరూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. విచారణ పేరుతో  జగన్‌ను జైలులో ఉంచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు. తన జీవితం వైఎస్ జగన్‌కు అంకితమని పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్సార్ సీపీ సంగారెడ్డి, కొండాపూర్ మండల కన్వీనర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. శ్రీధర్‌రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర మూడు రోజులపాటు 90 కిలోమీటర్ల మేర సాగనుంది. గురువారం చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకుంటుంది. అనంతరం శ్రీధర్‌రెడ్డితోపాటు ఇతర నాయకులు బాలాజీకి ప్రత్యేక పూజలు చేస్తారు. 

Back to Top