న్యూఢిల్లీ, 28 సెప్టెంబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి శుక్రవారమే బెయిల్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన వారి ఆశలపై విచారణ వాయిదా పడడం నీళ్ళు చల్లినట్లయింది. కొత్త న్యాయవాది బాధ్యతలు స్వీకరించినందున కొద్ది సమయం కావాలని సిబిఐ న్యాయవాది మోహన్ పరాశరన్ శుక్రవారం చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం మన్నించింది. సిబిఐ వినతిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం విచారణ చేపడతామని జస్టిస్ అప్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. <br/>జగన్మోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియన్, విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వచ్చారు.సిబిఐ దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచీ ఏ ఒక్క రోజున కూడా దర్యాప్తులో జగన్మోహన్‌రెడ్డి ఎక్కడా జోక్యం చేసుకున్న దాఖలా లేదు. విచారణ సందర్భంగా సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకూ జగన్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే.<br/>అంతకు ముందు ఈ నెల 14 జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన 26 వివాదాస్పద జిఓలలో క్విడ్ ప్రొ కో జరగలేదని ఒక పక్కన మంత్రులే పేర్కొంటున్నారని, జగన్ విషయంలో రాజకీయ కారణాలు చూపించి బెయిల్‌ను తిరస్కరించడం సరికాదని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం ముందుంచారు. జగన్ పట్ల సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వమూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.<br/>జగన్మోహన్‌రెడ్డి ఫలానా సాక్షిని ప్రభావితం చేశారని నిరూపించలేకపోయిన సిబిఐ ఏవేవో అడ్డదారులు వెతికి ఆయనకు బెయిల్ రానివ్వకుండా శతవిధాలా అడ్డుపడుతూనే ఉంది. ఈ కేసులో సాక్షి సూరీడు వాంగ్మూలానికి సంబంధించి అతనిని ప్రభావితం చేస్తున్నారని సిబిఐ ఈ నెల 14న వాదించినప్పటికీ జగన్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వరాదో వివరించాలని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ కౌంటర్ పిటిషన్‌ను పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు విచారణను ఈ శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్పై విచారణ మళ్ళీ అక్టోబర్ 5న జరగనుంది.