జగన్ బెయి‌ల్‌పై సిబిఐ కుయుక్తులు

వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌పై విచారణను సాగతీసేందుకు సీబీఐ కుయుక్తులు పన్నుతోంది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన‌ప్పటి నుంచీ దానికి అడ్డుపడేందుకు సిబిఐ శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బెయిల్‌కు సంబంధించి కోర్టు నోటీసులు అందుకోవడం దగ్గర నుంచి కౌంటర్ దాఖలు చేయడం, అనంతరం వాదనలు వినిపించటం వరకూ ప్రతి విషయంలోనూ ఏదో విధంగా విచారణను సీబీఐ జాప్యం చేస్తూనే వస్తోంది. విచారణ జరిగిన ప్రతిసారీ కుంటిసాకులతో వాయిదా కోరుతూనే ఉంది. తాజాగా శుక్రవారం కూడా సీబీఐ అధికారుల ఇదే ఎత్తుగడతో విచారణను వాయిదా వేయాలని కోర్టు ధర్మాసనాన్ని కోరడం గమనార్హం.

తమ తరఫున కొత్త న్యాయవాది రంగప్రవేశం చేయడంతో వాదించడానికి కొంత సమయం కావాలంటూ సిబిఐ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం మన్నించింది. సిబిఐ వినతిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ అ‌ప్తాబ్ ‌ఆలం, జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణను అక్టోబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. దీనితో జగన్మోహన్‌రెడ్డికి తప్పకుండా బెయిల్ వస్తుందని కొండంత ఆశతో ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, అభిమానులు సిబిఐ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 

జగన్మోహన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు గోపాల సుబ్రమణియం, విశ్వనాథం తమ వాదనలు వినిపిస్తున్నారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచీ ఒక్కసారి కూడా దర్యాప్తులో జగన్మోహన్‌రెడ్డి ఏ సందర్భంలోనూ జోక్యం చేసుకున్న దాఖలా లేదు. విచారణ సందర్భంగా అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ జగన్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చినప్పటికీ ఆయన పట్ల సిబిఐ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కేవలం వేధించడమే దాని ముఖ్యఉద్దేశం అని స్పష్టం అవుతోంది.

జగన్మోహన్‌రెడ్డి ఫలానా సాక్షిని ప్రభావితం చేశారని కూడా సిబిఐ ఇంతవరకూ నిరూపించలేకపోయింది. ఈ కేసులో సూరీడు వాంగ్మూలం ఇవ్వకుండా జగన్ ప్రభావితం చేస్తున్నారని సిబిఐ‌ ఆరోపించడం వెనుక దురుద్దేశం తప్పు మరోటి లేదు. జగన్‌కు బెయిల్‌ ఎందుకు ఇవ్వరాదో వివరించాలన్న ధర్మాసనం ప్రశ్నకు సిబిఐ దగ్గర సరైన సమాధానం ఉందా.... అంటే నిస్సందేహంగా లేదు. అందుకేనేమో ఈ కేసులో తన తరఫున వాదించే న్యాయవాదిని మార్చింది. దీనిని సాకుగా చూపించి విచారణ కొనసాగకుండా వాయిదా వేయించే ఎత్తుగడను అమలు చేసింది.

ఇలాంటి ఎత్తులు, జిత్తులు చూసినప్పుడు జగన్‌ విషయంలో సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోంది అన్న వాదనకు మరింత బలం చేకూరుతోంది. బహుశా సుప్రీంకోర్టు విచారణ సజావుగా ముందుకు సాగితే జగన్‌కు ఎక్కడ బెయిల్ వస్తుందో అన్న ఆందోళన సీబీఐ అధికారు‌ల్లో నెలకొనివుండొచ్చు.

సుప్రీంకోర్టులో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలను గమనించిన న్యాయ నిపుణులు కూడా ఇవే అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం. సీబీఐ అధికారులకు, ఆ సంస్థను నడిపిస్తున్న పాలకులకు బెయి‌ల్‌పై జగన్ బయటకు రావటం ‌సుతరామూ రుచించటం లేదని, అందుకే ప్రతిసారీ ఏదో ఒక కారణం చూపిస్తూ కేసును విచారణకు రాకుండా సీబీఐ ద్వారా అడ్డుకుంటున్నదని, సిబిఐ కుయుక్తులను సుప్రీంకోర్టు గమనిస్తూనే ఉందన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. ఉద్దేశపూర్వకంగా సిబిఐ వాయిదాలు కోరుతోందనేందుకు వారు ఉదాహరించిన కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

కౌంటర్ దాఖలు ‌నుంచీ ఇదే వరస! :
సుప్రీంకోర్టులో జగన్మోహన్‌రెడ్డి జూలై 27న రెండవసారి బెయిల్ పిటిష‌న్ దాఖలు చే‌శారు. సీబీఐ రిజిస్ట్రీలో సృష్టించిన అడ్డంకులను అధిగమించి రెండు వారాల అనంతరం అది సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆగస్టు 10న బెయిల్ పిటిష‌న్‌పై విచారించిన ధర్మాసనం, సీబీఐకి నోటీసులు జారీ చేసి, కౌంటర్ దాఖలు‌ చేయమని ఆదేశించింది. అయితే, కౌంటర్‌ వేయడానికి సీబీఐ సుమారు నెల రోజులపాటు తాత్సారం చేసింది. చివరకు సెప్టెంబర్ 7‌వ తేదీన కౌంట‌ర్‌ను దాఖలు చేసింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి సిబిఐ నెల రోజుల వ్యవధి తీసుకోవడంపై న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి అంతకన్నా ముందే కౌంటర్ దాఖలు చేసి ఉండొచ్చన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశాన్నీ పలుమార్లు కోర్టుల్లో కౌంటర్ల రూపంలో సీబీఐ దాఖలు చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. బెయిల్ పొందటం అనేది నిందితులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని, ఉద్దేశపూర్వంగా విచారణను వాయిదా వేయించటం ద్వారా ఆ హక్కును హరించడం సరి కాదన్నది న్యాయ నిపుణుల వ్యాఖ్య.

ఒక వర్గం మీడియాలో మళ్ళీ కుళ్ళు కథనాలు:
ఇలా ఉండగా, ఇంతకు ముందు సీబీఐ తన న్యాయవాదిని మార్చడం కూడా ఓ వర్గం మీడియాకు నచ్చలేదు. తన కుళ్ళు బుర్రలో తోచిన కథనాలను అల్లిపారేసింది. అప్పటి వరకు జగన్ కేసులను వాదిస్తూ వచ్చిన అశో‌క్‌భాన్ వంటి సీనియ‌ర్ న్యాయవాదులను కాదని, కొత్త న్యాయవాదిని నియమించటం వెనుక ఏదో మతలబు ఉందంటూ గాలి రాతలు రాసింది. అయితే శుక్రవారం సీబీఐ మరోసారి న్యాయవాదిని మార్చింది. మోహన్‌జైన్ ‌బదులు అదనపు సొలిసిటర్ జనర‌ల్ మోహ‌న్ పరాశర‌న్‌కు కేసు బాధ్యతలు అప్పగించింది. విచారణకు సీబీఐ తరఫున మోహన్‌ పరాశరన్‌ సుప్రీం ధర్మాసనం ముందు హాజరు కాలేదు. ఆయన వేరే కేసును వాదిస్తూ సుప్రీంకోర్టులోనే మరో బెంచ్‌లో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని అశోక్‌భాన్‌ ధర్మాసనానికి విన్నవించడం గమనార్హం. అశోక్‌భాన్‌ ధర్మాసనాన్ని స్వయంగా వాయిదా కోరడం విశేషం.

సిబిఐ తరఫున న్యాయవాదిని మార్చామని, మోహన్‌ పరాశరన్ వాదనలు వినిపిస్తారని ‌అశోక్‌ భాన్‌ ధర్మాసనం ముందు చెప్పారు. న్యాయవాది మార్పు వెనుక మతలబు ఉందనుకుంటే.. సీనియర్ అయిన అశోక్‌భాన్ ఎందుకు తమ వాదనలు వినిపించలే‌దన్న అనుమానాలు ప్రశ్నగానే మిగులుతున్నాయి. ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టులోనే ఉన్న సీబీఐ జేడీ తమ వాదనలు వినిపించాలని అశోక్‌భాన్‌ను ఎందుకు కోరలేదన్న అంశమూ తెరపైకి వస్తోంది.

సుప్రీంకోర్టులోనే ఉన్న మోహన్ పరాశర‌న్ ఎందుకు వాదనలు వినిపించేందుకు రాలేదు? మళ్లీ న్యాయవాదిని మార్చామని, ఆయనే వచ్చి వాదనలు వినిపిస్తారని అశో‌క్‌భాన్ స్వయంగా ఎందుకు చెప్పా‌ల్సి వచ్చింది? అనేవి న్యాయ నిపుణుల సందేహాలు. నిజానికి సీనియర్ న్యాయవాది అయిన అశో‌క్‌భాన్ వాదనలు వినిపించి ఉండొచ్చు. జగ‌న్మోహన్‌రెడ్డి కేసులో ఆయన అనేక సార్లు పూర్తిస్థాయి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. 

జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ కేసు వాయిదా వేయడానికి ఆయన తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ ప్రతిసారీ ఇలా ఏదో ఒక సాకు చూపించి వాయిదా కోరుతోందని, ఇది ఎంత మాత్రం సరికాదని గట్టిగా వాదించారు కూడా. ఈ కేసును కనీసం వచ్చే సోమవారం విచారించాలని ధర్మాసనానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ అక్టోబర్‌ 5నే ఈ కేసును విచారిస్తామని ధర్మాసనం పేర్కొంటూ వాయిదా వేసింది. 

ప్రభుత్వం జారీ చేసిన 26 వివాదాస్పద జిఓలలో క్విడ్‌ ప్రొ కో జరగలేదని ఒక పక్కన మంత్రులే పేర్కొంటున్నారు. అయినప్పటికీ రాజకీయ కారణాలు చూపించి జగన్‌కు బెయిల్‌ రాకుండా అడ్డుపడడం సరికాదని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌ పట్ల అటు సిబిఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ కక్షపూరితంగా వ్యవహరిస్తుండడాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు.


Back to Top