ఆస్పత్రిలోనూ కొనసాగిన జగన్ దీక్ష

హైదరాబాద్ 30 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షను కొనసాగించారు. శుక్రవారం నాడు ఆయన దీక్ష ఆరో రోజుకు చేరింది. దీక్షను విరమించాలన్న వైద్యుల వినతిని ఆయన సున్నితంగా తోసి పుచ్చారు. నీళ్ళలో కనీసం గ్లూకోస్ కలుపుకుని తాగాలని సూచించినప్పటికీ ఆయన తిరస్కరించారు.  మరో వంక రాత్రి 8గంటల ప్రాంతంలో వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీ జగన్మోహన్ రెడ్డి వెన్నునొప్పితో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి 60కి పడిపోయింది. పల్సు 56-60 మధ్య, బీపీ 110/70 నమోదయ్యాయి. కీటోన్సు 4+ ఉన్నట్లు తేలింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు చెప్పారు. తక్షణం వైద్యం తీసుకోకపోతే ప్రమాదమని తెలిపారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు జైళ్ళ శాఖ అధికారులకు సాయంత్రం ఓ లేఖ రాశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి వైద్యం చేసే స్థాయిలో తమ వద్ద పరికరాలు లేవనీ, ఆయనను వేరొక ఆస్పత్రికి తరలించాలనీ వారు అందులో సూచించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా కోరారు.

ఆస్పత్రిలో సహాయంగా ఉంటామని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య శ్రీమతి వైయస్ భారతి అంతకుముందు, దాఖలు చేసిన మెమోను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో శ్రీమతి భారతి సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా వెళ్ళి శ్రీ జగన్మోహన్ రెడ్డికి సాయంగా ఉండేందుకు అవకాశం కల్పించాలని జడ్జికి విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేశారు. తదుపరి, శ్రీమతి భారతి ఉస్మానియా ఆస్పత్రి వద్దకు వెళ్ళి శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అవకాశమీయాలని ఎంతగా కోరినప్పటికీ వారు అంగీకరించలేదు. రిమాండులో ఉన్నఖైదీ కాబట్టి తాము అందుకు అనుమతించలేమని పోలీసులు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో శ్రీమతి భారతి చంచల్‌గుడా జైలుకు వెళ్లారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మానవతా దృక్పథంతో తనకు అవకాశమీయాలని జైలు సూపరింటెండెంటు సైదయ్యకు విజ్ఞప్తి చేశారు. మెమోను సీబీఐ కోర్టుకు తోసిపుచ్చినందున తామేమీ చేయలేమని ఆయన సున్నితంగా తోసిపుచ్చారు.

Back to Top