హెరిటేజ్ పాలను నిషేధించాలి

హైదరాబాద్, 08 ఏప్రిల్ 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ పాల తయారీపై విచారణ చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ జిల్లా కశింకోట మండలం బయ్యవరంలోని హెరిటేజ్‌ ఫ్యాక్టరీలో దుర్ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కరవైందని ఆందోళన వ్యక్తంచేశారు. హెరిటేజ్‌ పాలల్లో ఫార్మలిన్ అనే కాన్సర్‌ కారక రసాయనాన్ని కలుపుతున్నారనీ, ఈ అంశం కేరళ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌తో నిర్ధారణైందని ఆయన వెల్లడించారు.  కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాల వినియోగాన్ని ఆ రాష్ట్రంలో నిషేధించిందని జూపూడి తెలిపారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం జీవోను మీడియాకు విడుదల చేశారు. మన రాష్ట్రంలో మాత్రం ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని ఆయన మండిపడ్డారు. హెరిటేజ్ పాలతో లక్షలాదిమంది కేన్సర్కు గురవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తోందని జూపూడి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు. నిజ నిర్ధారణ కమిటీ వేసి చర్చించాలని జూపూడి డిమాండ్ చేశారు. పది మిల్లీ లీటర్ల పాలలో అయిదు మిల్లీ లీటర్ల ఫార్మలిన్ ఉన్నట్లు పరీక్షలలో వెల్లడైందన్నారు. చంద్రబాబునాయుడు రోజూ కొన్ని లక్షల లీటర్ల పాలలో రోజూ విషయం కలుపుతున్న విషయాన్ని కేరళ ప్రభుత్వం 2012 ఆగస్టులోనే చెప్పిందన్నారు. అనంతరం అదే ఏడాది సెప్టెంబరు 18న హెరిటేజ్ పాల వాడకాన్ని నిషేధిస్తూ గెజిట్ జారీ చేసిందని వివరించారు.

ఇంత ప్రమాదకరమైన పాలను మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరింటికెళ్ళినా.. ఏ హొటలుకు వెళ్ళినా ఏ పాలతో ఈ టీ తయారుచేశారని, మజ్జిగ ఏపాలతో తయారైందనీ అడగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. హెరిటేజ్ పాలను రెండు దశాబ్దాలుగా వాడుతున్న వారిలో ఎన్ని లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారో లెక్కలు తేలాల్సి ఉందన్నారు. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేరుతున్న వారి వ్యాధికి చంద్రబాబు కారకుడు కాదా అని నిలదీశారు. అసలా ఆస్పత్రిలో ఏం క్యాన్సర్ పరిశోధనలు చేపడుతున్నారు.. అక్కడ బతుకుతున్న వాళ్ళెంతమంది.. ఏం మందులు ఇస్తున్నారు.. ఎందరికి తగ్గిందీ అనే అంశాలపై ప్రభుత్వం నిజాయితీతో కూడిన విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. సురక్షితమైన పాలను అమ్ముతోందని తేలేదాకా ఆంధ్రప్రదేశ్‌లో హెరిటేజ్ పాలను నిషేధించాలని జూపూడి కోరారు.

చంద్రబాబును గట్టెంక్కించేలా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ చేపట్టాలని కోరారు. రాజశేఖరరెడ్డిగారు ఆరోగ్యశ్రీ పెట్టి ప్రజల ప్రాణాలను రక్షిస్తుంటే చంద్రబాబు క్యాన్సర్ శ్రీ పెట్టారనీ, ఇలాంటి నేతకు ఏ శిక్ష విధించినా తక్కువేనని చెప్పారు.  కేరళ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీనీ, ఆ రాష్ట్రానికి చెందిన ఆహార భద్రత కమిషనర్ విడుదల చేసిన ఉత్తర్వు నకలునూ జూపూడి మీడియాకు అందజేశారు.


కసింకోటలోని హెరిటేజ్ ఫ్యాక్టరీలో సంభవించిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన సందర్భంలో మొరపెట్టుకుందామని వస్తున్న వారిని పోలీసులు ఆపేసి వెనక్కి పంపారనీ, ప్రమాద సంఘటనను చిన్నదిగా చూపి చంద్రబాబును రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై అన్ని పత్రికలలో ఈ వార్త ప్రచురితమైందని తెలిపారు. ఏదైనా కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంటే యాజమాన్యం బాధ్యత తీసుకుంటుందనీ, కాని ఇక్కడ భిన్నంగా ఉందనీ చెప్పారు. కార్మికులకు అండగా నిలబడకపోవడం చంద్రబాబుకు కొమ్ముకాయడం కాదా అని నిలదీశారు.

Back to Top