హంద్రీనీవా మహానేత ఘనతే!

కర్నూలు:

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరికి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి అయిన వైయస్ షర్మిల కలత చెందారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ప్రారంభ సభలో కిరణ్ వైయస్ఆర్ పేరును ప్రస్తావించకపోవడమే దీనికి కారణం.  సాగునీరు, తాగునీరు లేక నానా కష్టాలు పడుతున్న రాయలసీమ ప్రజల బాధలు తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని షర్మిల పునరుద్ఘాటించారు. అలాంటి నేత పేరును జనం మర్చిపోవాలని ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తిప్పికొడతారన్నారు. ‘మరో ప్రజా ప్రస్థానం’ లో భాగంగా షర్మిల ఆదివారం సి. బెళగల్ మండలంలో 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.  ఈ సందర్భంగా పోలకల్‌లో జరిగిన బహిరంగసభలో ఆమె ఉద్విగ్నంగా ప్రసంగించారు. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభ సభలో సీఎం మహానేత రాజశేఖర్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని తెలిసి షర్మిల తీవ్రంగా కలత చెందారు. ‘కిరణ్‌కుమార్ రెడ్డికి.. రాజశేఖర్ రెడ్డి అంటే ఎందుకింత ద్వేషం. ఎన్టీఆర్, కోట్ల పేర్లు చెపుతూ రూ.4వేల కోట్లతో హంద్రీనీవా ప్రాజెక్టును చేపట్టిన రాజశేఖర్ రెడ్డి మాట ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం నాకు చాలా బాధనిపించింది’ అంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ గద్గద స్వరంతో చేసిన ప్రసంగం స్థానికులను కలచివేసింది. హంద్రీనీవా ప్రాజెక్టు వల్ల రాయలసీమలోని 6లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రజల కష్టాలు తీరుతాయని ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేశారని గుర్తు చేశారు. హంద్రీనీవా 95 శాతం పనులు రాజశేఖర్‌రెడ్డి హయాంలో పూర్తయితే 5శాతం పనులు పూర్తిచేయడానికి మూడేళ్ల సమయం తీసుకున్న కిరణ్  ... ఇదంతా తన ఘనతేనని చెప్పుకుంటూ సంస్కారహీనుడిగా వ్యవహరించారని విమర్శించారు.సీఎం కిరణ్ ప్రారంభించిన హంద్రీనీవా ఘనత పూర్తిగా రాజశేఖర్‌రెడ్డిదేనని ఉద్ఘాటిస్తూ, 50వేల ఎకరాలకు సాగునీరందించే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కూడా ఆయనే చేపట్టి పూర్తిచేశారని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించింది కేవలం వై.యస్. మాత్రమేనన్నారు.

17 కిలోమీటర్ల పాదయాత్రలో...
     షర్మిల ఆదివారం ఏకంగా 17 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి. మైసూరా రెడ్డి, పార్టీ శాసనసభాపక్షం ఉపనేత శోభా నాగిరెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ తదితర ముఖ్యనేతలతో షర్మిల పాదయాత్ర చేశారు. కంపాడు నుంచి బయలుదేరిన ఆమె సీ.బెళగల్, పోలకల్‌లలో ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దారిలో కనిపించిన ఉల్లి రైతులు తమ బాధలు చెప్పుకోగా వారికి ధైర్యం చెప్పారు.

     మధ్యలో కూలీలు, విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. అందరికీ ధైర్యం చెపుతూ జగన్‌కు అండగా నిలిచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. రాత్రి జూలకల్ శివార్లలో బస చేశారు. ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, కొత్తకోట ప్రకాష్ రెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, ఇతర నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎ.వి. సుబ్బారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఇతర నేతలు బి.ఎన్.ఆర్. రాజు, సుదర్శనం, రాజా రత్నం, డాక్టర్ ఎ. మధుసూదన్, తెర్నెకల్ సురేందర్ రెడ్డి, నిడ్జూరి రాంభూపాల్ రెడ్డి, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top