హైదరాబాద్‌ భూముల్ని పప్పుబెల్లాల్లా పంచిన బాబు

హైదరాబాద్‌, 28 నవంబర్‌ 2012: హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల భూములను చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న వారికి పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ఆరోపించారు. అన్నింటినీ మేనేజ్‌ చేసుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఆమె వ్యాఖ్యానించారు. చిదంబరాన్ని చీకట్లో కలిసి తనపైన విచారణ జరగకుండా చేయించుకున్న ఘనుడూ ఆయనే అన్నారు. అబద్ధపు వాగ్దానాలతో ఇప్పుడు ప్రజల వద్దకు వస్తున్న చంద్రబాబును విశ్వసించవద్దని విజయమ్మ పిలుపునిచ్చారు.‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ బాబు త్వరలోనే బయటికి వస్తారని, రాజశేఖరెడ్డి హయాంలోని సువర్ణయుగాన్ని తీసుకువస్తాడని ఆమె ధీమాగా చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు బుధవారం విజయమ్మ సమక్షంలో వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. ఆయనతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మూడు వేల మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్‌సిపి తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి ట్రక్‌ పార్కింగ్‌ మైదానంలో బుధవారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో విజయమ్మ వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి విజయమ్మ మాట్లాడారు.

హైదరాబాద్‌ను చుట్టుపక్కల ప్రాంతాలను కారు చౌకగా తన బినామీలకు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విజయమ్మ ధ్వజమెత్తారు. తన భార్య భూములను ఎకరం కోటి రూపాయలకు విక్రయించిన చంద్రబాబు ఆ పక్కనే ఉన్న 850 ఎకరాలను ఎకరా కేవలం రూ. 50 లక్షలకే అప్పనంగా కట్టబెట్టారని దుయ్యబట్టారు. నగర శివార్లలోని స్టేడియాలను ఐఎంజీ సంస్థకు నిర్వహణకు అప్పగించడమే కాకుండా ఆ సంస్థకు ఏడాదికి కోటి రూపాయలు ప్రభుత్వం చెల్లించేలా చంద్రబాబు ఉత్తర్వులు ఇవ్వడాన్ని విజయమ్మ తప్పుపట్టారు. ధనవంతులు మాత్రమే చదువుకునే బిజినెస్‌ స్కూల్‌ను చంద్రబాబు తెస్తే, సామాన్యులకు అందుబాటులో ఉండే మూడు ప్రాంతాల్లోనూ ట్రిపుల్‌ ఐటిలు తెచ్చిన రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ఆరాటమంతా పెద్దవారి కోసమే అని విజయమ్మ ఎద్దేవా చేశారు. పేదల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని ఆమె అన్నారు.

హైదరాబాద్‌ నగరాన్ని వైయస్‌ తీర్చిదిద్దారని, నగరం చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేశారని విజయమ్మ పేర్కొన్నారు. అయితే, తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు బడాయిలు చెబుతున్నారన్నారు. హైదరాబాద్‌కు ఆయువుపట్టు లాంటి ఎన్నో పరిశ్రమలు చంద్రబాబు హయాంలోనే మూతబడిపోయాయని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిలకు ఆయన హయాంలో అంతా అన్యాయమే జరిగిందన్నారు. ఆల్విన్‌ సంస్థ మూతపడిపోతుంటే చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. 

చంద్రబాబుకు ఏ కోర్టు క్లీన్ చిట్‌ ఇచ్చింది?:
చంద్రబాబు నాయుడికి ఏ కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. 52వ ప్రతివాదిగా ఉన్న జగన్‌బాబును మొదటి ముద్దాయి మాదిరిగా చేసి జైలులో పెట్టించారని నిందించారు. చంద్రబాబుకు గోబెల్సు ప్రచారం బాగా తెలుసన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ అదే నిజమని జనాన్ని నమ్మించడం చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య అని విజయమ్మ విమర్శించారు. చంద్రబాబు పుట్టింది ఏప్రిల్‌ 20 తేదీన అని అంటే 420 బుద్ధులు ఆయనకు బాగా అలవడ్డాయని చమత్కరించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు. మాట మీద నిలబడడం తెలియదన్నారు. తన పాలనా కాలం 8 ఏళ్ళలో 8 సార్ల విద్యుత్‌ చార్జీలు పెంచేశారని ఇప్పుడేమో అబద్ధాల వాగ్దానాలు ఇస్తూ అధికారం ఇమ్మని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

ఒక్క రేషన్‌ కార్డయినా ఈ ప్రభుత్వం ఇచ్చిందా?:
రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డయినా కొత్తగా ఇచ్చిందా? అని విజయమ్మ నిలదీశారు. పైగా సర్‌చార్జీల పేరుతో జనంపై ఈ ప్రభుత్వం ఆర్థికంగా భారం మోపుతోందని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండానే జగన్‌ను అక్రమంగా జైలులో నిర్బంధించారన్నారు. న్యాయం తమ పక్షాన ఉందన్నారు. జగన్‌బాబు బయటికి వస్తారని, రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్ళీ మనందరికీ తీసుకువస్తారని విజయమ్మ భరోసా ఇచ్చారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకూ మీరంగా ప్రజల మధ్యే ఉండి, వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి అని విజయమ్మ పార్టీలో చేరిన వారికి సూచించారు.

అంతకు ముందు పార్టీలో చేరిన వడ్డేపల్లి నర్సింగరావు, పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు సభా వేదికపై నుంచి మాట్లాడారు. పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ కన్వీనర్‌ జనార్ధన్‌, గట్టు రామచంద్రరావు, జనక్‌ ప్రసాద్‌, విజయారెడ్డి తదితరులు వేదికపై ఉన్నారు.
Back to Top