అన్నదాతల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం

మేడికొండూరు: అధికార ప్రభుత్వం అన్నదాతల సంక్షేమాన్ని మరచి వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పారెడ్డి రామక్రిష్ణారెడ్డి అన్నారు. స్ధానిక పేరేచర్ల కూడలిలో మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్‌సిసెల్‌ కార్యదర్శి తమనంపల్లి శాంతయ్యతో కలసి విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతుల సమస్యలను గాలికొదిలేసి వారిని నానా రకాలుగా అవస్ధలకు గురిచేసారన్నారు. రుణమాఫీ పేరుతో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రస్తుత పరిస్ధితుల్లో దాని గురించి కూడా పట్టించు కోవటం లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా పచ్చని పైర్లు పండే పంట పొలాలను రాజధాని పేరుతో బలవంతంగా లాక్కొని రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేసారన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బడి ముబ్బడిగా ప్రెవేటు కంపెనీలకు భూములను అప్పగించే పనిలో ఉన్నారని తెలిపారు. రేపల్లె తీరంలో రకరకాలు పంటలు పండే భూముల్లో పార్మాకంపెనీలు, రసాయనిక ఔషదాలు తయారు చేసే కంపెనీలకు అన్నదాతల భూములను అప్పగిస్తున్నారని దీంతో అక్కడి రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఇది హేయమైన చర్య అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.  రైతులు నకిలీ విత్తనాల బారిన పడి పంటను పీకేస్తుంటే ఏమీ పట్టనట్లు ఊరుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు సరైన సమయానికి సాగునీరు అందక, పంటకు గిట్టుబాటు ధరలేక కైలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. నాగార్జునసాగర్‌లో నాలుగువందల తొంభై అడుగుల నీటిమట్టం ఉన్పప్పుడే దివంగత రాజశేఖర్‌రెడ్డి రైతులకు సంవ్రుద్దిగా నీరు అందించారని ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేశారని ఆయన అధికార ప్రభుత్వానికి హితవు పలికారు. ఇప్పటికైనా రైతుల సంక్షేమం దిశగా అడుగులు వేయాలని లేదంటే పరిస్ధితి మరింత దారుణంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎస్‌సిసెల్‌ రాష్ట్ర కార్యదర్శి తమనంపల్లి శాంతయ్య మాట్లాడుతూ అధికార పార్టీ అవలంబిస్తున్న విధానాలు ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయని అన్నారు. పేదప్రుజలను, రైతులను విస్మరిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించు కోక తప్పదని ఆయన ఈసంధర్బంగా తెలియజేశారు.

 
Back to Top