దేవుడు అంతా చూస్తున్నాడు

హైదరాబాద్ 06 జూలై 2013:

రాజశేఖరరెడ్డిగారి మీద అభిమానంతో, శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిపై ప్రేమతో రేపల్లె నియోజకవర్గంనుంచి మోపిదేవి వెంకట రమణ గారి తమ్ముడు హరినాధ్ బాబు, కుమారుడు రాజేష్ ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలందరికీ తమ పార్టీ స్వాగతం పలుకుతోందన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ సోదరుడు, కుమారుడు పార్టీలో చేరిన సందర్భంగా ఆమె లోటస్ పాండ్ లోని కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్, శ్రీ జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి కేసులు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీలో జగన్ బాబు ఉన్న 15 నెలలు ఎటువంటి కేసులూ పెట్టలేదన్నారు. రాజన్న మరణానంతరం నల్లకాలువలో ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్రకు బయలు దేరిన జగన్ బాబుపై వేధింపులు మొదలయ్యాయన్నారు. రాజన్న ఇచ్చిన 26 జీఒలపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ఉంటే కేసులు ఉండేవి కావన్నారు. కావాలని ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. సుప్రీం కోర్టులో మంత్రులంతా జివోలు సక్రమమేనని చెప్పారనీ, హైకోర్టులో మాత్రం ప్రభుత్వం ఆ మాట చెప్పడం లేదనీ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిగారిని ఇబ్బంది పెట్టాలని బనాయించిన కేసు ఇదని శ్రీమతి విజయమ్మ స్పష్టంచేశారు. ఆయనను జైలులో ఉంచి రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

బీసీ అయిన మోపిదేవి వెంకట రమణ గారిని ఈ కేసుల్లో బలిపశువుని చేశారని చెప్పారు. వారం రోజుల్లో బయటకు తీసుకొస్తామని జైలుకు పంపి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందన్నారు.  చంద్రబాబు మీద ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. ఏ ఒక్క కేసు మీద విచారించడానికైనా సీబీఐ వద్ద సిబ్బంది లేదని చెప్పారన్నారు. అదే జగన్ బాబుపై 24 గంటల వ్యవధిలో 28 బృందాలతో దాడులు చేయించారన్నారు. మూడు దశాబ్దాలపైన కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన రాజశేఖరరరెడ్డి గారికి ప్రభుత్వం కేసులు, వేధింపులు, ఎఫ్ఐఆర్‌లో మహానేత పేరు చేర్చడం చేస్తోందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాన ప్రతిపక్షంతో కలిసి బెయిలు రాకుండా కూడా ఎన్నో కుట్రలు చేస్తోందన్నారు. మూడో పార్టీ ఉండకూడదు.. సాక్షి పేపరు ఉండకూడదు అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. సాక్షి పత్రిక మీద, జగన్ బాబు మీద తమ అక్కసును చూపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు అమాయకులు కాదనీ, జగన్ బాబును నాయకుడిగా గుర్తించారనీ చెప్పారు. ఎన్ని కేసులు పెట్టాలనుకున్నా, ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో దేవుడు గమనిస్తున్నాడని తెలిపారు. రామాయణంలో రావణాసురిడిని సంహరించడానికి రాముడు ఎలా దిగి వచ్చాడో ఇప్పుడు కూడా అలాగే దిగొస్తాడని శ్రీమతి విజయమ్మ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

పంచాయతీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. నవంబరు, డిసెంబరు నెలల్లో సాధారణ ఎన్నికలు వస్తాయనిపిస్తోందనీ.. ఏ ఎన్నికలొచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలనీ ఆమె పిలుపునిచ్చారు. త్వరలో జగన్ బాబు, మోపిదేవి వెంకట రమణ జైలు నుంచి బయటకొస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. జగన్ బాబుకు వ్యతిరేకంగా చెప్పమని మ్యాట్రిక్సు ప్రసాద్ గారిని ప్రభుత్వం ఎంతో ఒత్తిడి చేసిదన్నారు. ఏ సంగతి ఎలా ఉన్నా మనమంతా పంచాయతీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా సాగాలని కోరారు.

Back to Top