()ప్రజల హృదయాల్లో చెరగని సంతకం
()అన్ని వర్గాలకు మేలు చేసిన మహానేత
()మాట తప్పని..మడమ తిప్పని నైజం
()ఆయనే.. దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి
వైయస్ రాజశేఖరరెడ్డి ...తెలుగు ప్రజల గుండెసవ్వడి. నమ్మకానికి, విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు. తెలుగు ప్రజలకు అద్భుతమైన పాలన అందించి ప్రతీ ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న మహనీయుడు. భౌతికంగా దూరం అయినా, శాశ్వతంగా ప్రతీ తెలుగువాడి గుండెలో కొలువై ఉన్న ఆదర్శప్రాయుడు .
తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయింది. ఆ స్థితిలో ‘పాదయాత్ర’ అనే ప్రజాప్రస్తానాన్ని చేపట్టి జనంలో నమ్మకాన్ని కలిగించారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వరుసగా కృషి చేసినా 2003 ఆరంభం నాటికి కూడా ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పార్టీ చావు బతుకుల్లో ఉండేది. ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి, బలం చేకూర్చారు వైయస్‌ఆర్. ఇక 2004లో అత్యధిక మెజార్టీతో రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది మొదలు పల్లెబాట, నగరబాట, రైతుబాట, ప్రాజెక్టుల బాట వంటి కార్యక్రమాలతో నిత్యం జనంలో ఉంటూప్రజా సమస్యల్ని లోతుగా అర్థం చేసుకొంటూ అన్ని వర్గాల ప్రజల అవసరాల్ని తీర్చడానికి కృషి చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరాయి. నాడు ఏపీలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు పలు రాష్ట్రాలకు, కేంద్రానికి ఆదర్శంగా నిలిచాయి. పలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన పథకాల్ని మెచ్చుకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా వైయస్ నుంచి స్ఫూర్తి పొంది ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని అమెరికాలో అమలు పరిచాడు.
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న మహానాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి. ప్రాణదాత, విద్యాదాత, రైతుబాంధవుడు . తెలుగు ప్రజల పెన్నిధి. ఎనలేని సంక్షేమ పథకాలను అందించి తెలుగు ప్రజల చేత ముద్దుగా రాజన్న అని పిలుపించుకుంటూ వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ‘వైయస్‌ఆర్ ఫర్ ఎవర్’ అనే సీరిస్‌తో రచించిన ప్రత్యేక కథనం.
పేదలకు వరం.. ఆరోగ్యశ్రీ
‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ ఈ పేరు దేశంలోనే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది.. నిరుపేదల సంజీవనిగా కొనసాగుతూనే ఉంది. వైయస్ రాజశేఖరరెడ్డి స్వయాన డాక్టర్ కాబట్టి పేదల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీస్తుండేవారు. కార్పొరేట్ వైద్యం కాదు కదా.. చిన్న ఆస్పత్రులకు వెళ్లలేక.. డబ్బులు లేక ఇంటి వద్దే చనిపోతుండడం చూసి చలించి పోయే వారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో నుంచి పుట్టిందే ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. ఇది నిజంగా పేదల సంజీవనే. చిన్న చిన్న జబ్బులతోపాటు పెద్ద జబ్బులకు కూడా ఉచిత వైద్యం అందించే ఏర్పాటు ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు మహానేత. దాదాపు 1000 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీలో చోటు కల్పించారు. దరఖాస్తు చేసుకున్న 12 గంటల్లోనే అనుమతులు ఇచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేయడమే కాదు.. అందుకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు వారిని ఇంటికి చేర్చేంత వరకు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించింది. దీంతో ప్రజలు వైయస్‌ఆర్‌ను దేవుడిలాగా చూడడం మొదలు పెట్టారు. అప్పుడు ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా నేటికి పేదలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందుతున్నారు. అనారోగ్య బాధితులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి వారికి లేఖ రాసేవారు. అంతటి ప్రేమ, అభిమానం పేదలపై చూపించేవారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి.
అత్యవసర వైద్యం..మహానేత పుణ్యమే
అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామిగా పేరుపొందుతున్నాయి 108 అంబులెన్స్‌లు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా దాదాపు 5, 10 నిమిషాల్లో సంఘటనా స్థలానికి కుయ్..కుయ్..కుయ్ అంటూ వచ్చి వారిని ఆస్పత్రులకు చేర్చుతున్నాయి. చిన్న చిన్న రోగాలకు వైద్య సలహాలు అందించేందకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా 104 ఉచిత కాల్ సెంటర్ , నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖరెడ్డిదే.
అన్నదాత సుఖీభవ!
కిలో బియ్యం రూ.15 నుంచి రూ.20లు అమ్ముతున్న రోజులవి. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నా ఆలోచన చేయాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదవాళ్లకు కిలో బియ్యం రూ.2లకే అందించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి నష్టం వస్తుందని అధికారులు వాదిస్తున్నా... బడ్జెట్ లేదని లెక్కలు చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. పేదవాళ్లకు కనీస తిండి విషయంలో ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ‘కిలో బియ్యం రూ.2లకే’ పథకాన్ని ప్రవేశపెట్టారు. కడుపునిండా అన్నం పెట్టారు. పేదవాళ్ల ఆకలి తీర్చారు. అందుకు వైయస్‌ఆర్ ను అందరూ అన్నదాత సుఖీభవ! అంటూ ఆశీర్వదించారు.
సొంతింటి కల సాకారం
చాలా మందికి కలగా మిగిలిపోయిన సొంతిటి కలను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి నిజం చేశారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సొంతిల్లు నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్లి బడుగు, బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా సొంతింటి కలను సాకారం చేశారు. ‘‘ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ’’ వంటి పథకాలను ప్రవేశపెట్టి ఇల్లులేని చాలా మందిని సొంతింటి వారిని చేశారు. కనీస అవసరాలైన కూడు..గూడును కల్పించారు. ఎవరు వద్దంటున్నా పట్టించుకోకుండా ముందుకెళ్లి అందరి మన్ననలు పొందారు.
పింఛన్.. ధైర్యమిచ్చెన్!
చంద్రబాబు పాలనలో పింఛన్ రావాలంటే..ఆ గ్రామంలో పింఛన్ లబ్ధిదారుడి చావు కోసం ఎదురు చూస్తున్న రోజులవి. నెలకు రూ.30 ఇచ్చే పింఛన్ కోసం లబ్ధిదారులు నెలల తరబడి ఎదురుచూసేవారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలనుకున్నారు... ఎవరూ లేని వారికి అన్నీ తానై ఉండాలనుకున్నారు... అన్నట్లుగానే ఆత్మబంధువుగా నిలిచాడు వైయస్‌ఆర్. వృద్ధులు, వితంతువులు, చేనేతలు, వికలాంగులులకు ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్ రూపంలో రూ.200 నుంచి రూ. 500 దాకా ఇచ్చే ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసినా కూడా పేదలను ఆదుకోవాలనే ధృడ సంకల్పంతో ముందుకెళ్లారు. ఆదరణ కోల్పోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్న దాదాపు 70 లక్షల మందికి (ఉమ్మడి రాష్ట్రంలో) పింఛన్ పథకాన్ని విస్తరించిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డిది.
‘ఇందిర ప్రభ’..పేదల జీవితాల్లో శోభ!
రాష్ట్రంలోని పేద ప్రజలకు ‘ఇందిర ప్రభ’పేరుతో భూములు పంపిణీ చేశారు. ఐదేళ్ల కాలంలో దాదాపు 6.5 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరిజనుల భూ పంపిణీ చట్టాన్ని దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేసి మొత్తం 13 లక్షల ఎకరాలు భూమిని పంపిణీ చేశారు. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి కీర్తి ప్రఖ్యాతులు సంపాదించారు.
==============================
రచయిత:డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి