'ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక గడువు పెంచాలి'

విశాఖపట్నం : రాష్ట్ర శాసనసభ ఇటీవల ఆమోదించిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టానికి మరిన్ని సవరణలు చేసి, చట్టబద్ధత కల్పించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ డిమాండ్‌ చేసింది. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకా‌శ్‌ ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.‌ ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్ కాలపరిమితికి నిర్ణయించిన పదేళ్ల కాలాన్ని పెంచాలన్నారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ సిపి కార్యాలయంలో శనివారంనాడు నగర కమిటీ ఆధ్వర్యంలో పార్టీ ఉత్తరాంధ్ర దళిత ఆదివాసీల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ,‌ నిజానికి దళిత, గిరిజనుల ఉప ప్రణాళిక రూపకర్త దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని ‌పేర్కొన్నారు. 2007లోనే నోడల్ ఏజెన్సీ ప్రవేశపెట్టి దళితులు, గిరిజనుల ప్రయోజనాల‌ కోసం మహానేత వైయస్‌ఆర్ ప్రత్యేక బడ్జె‌ట్ కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

అనంతరం అధికారం చెలాయిస్తున్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఎస్పీ, ఎస్టీ స‌బ్ ప్లా‌న్‌లో మార్పులు చేసి దళితులు, ఆదివాసీలకు నామమాత్రపు ప్రయోజనాలే కలిగేలా ప్రణాళిక సిద్ధం చేశారని ఆరోపించారు. ఆనక దానికి శాసనసభ ఆమోదం పొందేలా చేశారన్నారు. దళిత, గిరిజనులకు అరకొర ప్రయోజనాలు కలిగేలా చేసిన కిరణ్‌ ప్రభుత్వ వైఖరిని వైయస్‌ఆర్‌ సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ వ్యతిరేకించారని తెలిపారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఉప ప్రణాళికనే యథాతధంగా ఆమోదించాలని ఆమె డిమాండ్ చే‌సిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ, ‌టిడిపిలోని కొందరు నాయకులు ఈ అభ్యంతరాన్ని వక్రీకరించారని ధ్వజమెత్తారు.

దళితులు, గిరిజనులకు ప్రయోజనం కలిగేలా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను అమలుచేస్తే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తుందని సూర్యప్రకాశ్ ‌స్పష్టం చేశారు. సబ్‌ప్లాన్ ప్రతులను ఎమ్మెల్యేలకు సైతం ఇవ్వకుండా ఎందుకు రహస్యంగా ఉంచారని‌ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ సదస్సులో దళిత, గిరిజన నాయకులు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తీర్మానం చేశారు.‌

నల్లా సూర్యప్రకాశ్, ప్రాంతీయ కో ఆర్డినేట‌ర్ ప్రసాదరాజు, ఎమ్మెల్యే గొల్ల బా‌బూరావు, పార్టీ విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివా‌స్ తదితరుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పార్టీ తీర్మానాలను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్ కాలపరిమితికి నిర్ణయించిన పదేళ్ల కాలాన్ని పెంచాల‌ని తీర్మానం చేశారు. ప్లాన్ సంపూర్ణ అధికారాలు నోడ‌ల్ ఏజెన్సీకి అప్పగించాలని, సమానత్వాన్ని సాధించాలని, జనాభా ప్రాతిపదికన బడ్జె‌ట్‌లో నిధులు కేటాయించాలని, నోడల్ ఏజెన్సీ రెండేళ్ల‌కు ఒకసారి నిర్వహించే సమీక్ష సమావేశాన్ని మూడు నెలలకోసారి నిర్వహించాలని, గిరిజన నిధులు వారి కోసమే ఖర్చు జరిగేలా చట్టం చేయాలని తీర్మానించారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని పార్టీ అధికార ప్రతినిధి, గిరిజన నాయకుడు కంపా హనోకు తీర్మానం చేశారు. కార్యక్రమంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Back to Top