ఎరువుల ధర తగ్గించాలి


హైదరాబాద్, 14 డిసెంబర్ 2012: రైతులకు భారంగా మారిన ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. దేశ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎరువుల ధరలను తగ్గించడం అత్యంత ఆవశ్యకమని శుక్రవారంనాడు ప్రధానికి రాసిన లేఖలో శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. పెరిగిన ధరలతో వ్యవసాయం చేయడమే రైతులకు భారమవుతోందన్నారు.

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని శ్రీమతి వైయస్ విజయమ్మ లేఖలో పేర్కొన్నారు. మహానేత హయాంలో అభివృద్ధి రేటు 6.87 శాతంగా నమోదైందని గుర్తు చేశారు. దేశంలో మొదటి సారి అంత వృద్ధి రేటు సాధించిన ఘనత వైయస్ఆర్‌కే దక్కిందన్నారు. వ్యవసాయాభివృద్ధికి ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వ్యవసాయ రంగం కుంటుపడిందన్నారు. ఉత్పాదకత పడిపోయిందని, అందుకు పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలే కారణమని శ్రీమతి వైయస్ విజయమ్మ పేర్కొన్నారు. 

     గడచిన రెండేళ్లలో వరి కనీస మద్దతు ధర కేవలం 25 శాతం మాత్రమే పెరిగిందన్నారు. కానీ రైతులు ఎక్కువగా వినియోగించే ఎరువులు, విత్తనాల ధరలు మాత్రం 300 శాతం పెరిగాయని శ్రీమతి వైయస్ విజయమ్మ లేఖలో పేర్కొన్నారు. రైతులు విరివిగా వాడే డీఏపీ రకం ఎరువు ధర 2010లో రూ.500 ఉంటే 2012లో రూ.1250లకు పెరిగింది. ఎన్‌పీకే 10-26-26 రకం ఎరువు ధర రూ.400 ఉంటే రూ.1200లకు పెరిగిందన్నారు. రూ.200-225 ఉన్న ఎమ్ ఓపీ ధర రూ.1,000కి పెరిగిందన్నారు. అంటే డీఏపీ ధర 150 శాతం, ఎన్‌పీకే 200 శాతం, ఎమ్‌ఓపీ 300 శాతం ధరలు పెరిగాయని శ్రీమతి విజయమ్మ తన లేఖలో గుర్తు చేశారు.

Back to Top