మిగులుజలాల ప్రాజెక్టుల జాతకాలు తేల్చాలి

హైదరాబాద్, 21 సెప్టెంబర్ 2013:

కేవలం మిగులు వరద జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టుల జాతకాలను ముందుగా తేల్చాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ తరువాత మాత్రమే రాష్ట్ర విభజన గురించి ఎవరైనా మాట్లాడాలని అన్నారు. మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రపంచంలో ఇంక ఎక్కడా లేవన్నారు. రాష్ట్ర విభజనపై హిందూ దినపత్రిక నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, రాయలసీమలో తెలుగు గంగ, హంద్రీ నీవా, ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు మిగులు జలాలపై ఆధారపడి ఏర్పాటు చేసినవే అన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయం ఈ ప్రాజెక్టుల భవితవ్యంపై పడుతుందని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ పార్టీ ‌తరఫున గాదె వెంకటరెడ్డి, టిఆర్‌ఎస్ నుంచి ‌కెటిఆర్‌, సిపిఎం పార్టీ తరఫున బి.వి. రాఘవులు, సిపిఐ నుంచి కె. నారాయణ, లోక్ సత్తా ‌జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకా‌ష్ నారాయణ్ పాల్గొ‌న్నారు. రాష్ట్ర విభజనపై వారు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే.. టిడిపిని ఆహ్వానించినప్పటికీ.. ఆ పార్టీకి చెందిన వారెవ్వరూ ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం.

Back to Top