చంద్రబాబును ప్రజలు రాళ్లతో కొట్టే రోజు వస్తుంది

ఒంగోలు, నవంబరు 25: ఎన్నికల ముందు అలివికాని హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా రోజుకో అబద్ధం చెబుతున్న చంద్రబాబును ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. పదవి కోసం అబద్ధపు హామీలు గుప్పించిన చంద్రబాబునాయుడు వాటిని అమలు చేయడానికి సాకులు చెబుతున్నాడని విమర్శించారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఒంగోలు, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, దర్శి, కొండేపి నియోజకవర్గాలను ఆయన మంగళవారం సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉండటానికి కారణాలు తెలీదు కానీ.. తనకు ముఖ్యమంత్రి కావడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే 30 సంవత్సరాలు పాలించాలని, ఆ 30 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎంతగా మంచి చేయాలంటే.. తాను చనిపోయాక నాన్న ఫొటోతో పాటు తన ఫొటో కూడా ఉండాలన్న కోరిక బలంగా ఉందని చెప్పారు. అందుకే అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయానని తెలిపారు. అబద్ధపు హమీలు నమ్మి ప్రజలు అధికారమిచ్చినా, ఐదేళ్లకే పంపించేసేవారని చెప్పారు.

ముఖ్యమంత్రి కావడం కోసం ఏ అబద్దమైనా ఆడి, ఏ మోసమైనా చేసి, ఏ గడ్డైనా తిని, ఆ కుర్చీలో కూర్చుంటే ప్రజలకు న్యాయం చేసిన వారం అవుతామా? అన్నది గుండెలపై చెయ్యి వేసుకుని ఆలోచించుకోవాలని చంద్రబాబుకు సూచించారు. టీడీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 5న కలెక్టరేట్ల ఎదుట జరిగే ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రోజున తాను విశాఖపట్నంలో ధర్నాలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.

ఇవాళ చంద్రబాబు రోజుకో అబద్దం ఆడకపోతే ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు నిజాలు చెబితే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. అందుకే అబద్దాలు చెబుతూ తిరుగుతున్నారు. రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి, బంగారం బయటకు రావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలంటూ టీవీల్లో, పత్రికల్లో, హోర్డింగుల్లో, ఊదరగొట్టారు. జాబు రాకపోతే ప్రతి నిరుద్యోగికి రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు.

రుణమాఫీ విషయానికొస్తే ఐదువేల కోట్లు బడ్జెట్ లో పెట్టారు. దీంతో 20 శాతం ప్రజల రుణం మొదటిదశలో మాఫీ చేస్తానని చెప్పారు. రైతుల రుణాలు రూ. 87 వేల కోట్లు ఉంటే, డ్వాక్రా రుణాలు రూ. 14వేల కోట్లున్నాయి. మొత్తం కలిపితే రూ. 1.01 లక్షల కోట్లున్నాయి. చంద్రబాబు మాట విని రైతులు వడ్డీ చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీ 14 శాతం పడింది. అంటే అప్పటికే రూ. 14 వేల కోట్లు భారం పడింది. ఈ ఏడాది ఐదువేల కోట్లే బడ్జెట్ కేటాయింపు ఉండటంతో వచ్చే ఏడాదికి ఈ వడ్డీ 28 వేల కోట్లకు చేరుతుంది. అసలు సంగతి దేవుడెరుగు. ఆయన కేటాయింపులు వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి. అయినా ఇప్పటికీ అదే బుకాయిస్తూ ఉంటే ఈ మనిషి మనిషేనా అనిపిస్తుంది.

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడబీకుతున్నారు. రాష్ట్రంలో కోటి డెబ్భై ఐదు లక్షల కుటుంబాబు ఉన్నాయి. వారందరికీ కనీసం నిరుద్యోగ భృతి అయినా వస్తుందని ఎదురుచూస్తున్నారు. భృతి ఎప్పుడు ఇస్తారని అడిగితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదని నిస్సిగ్గుగా దాటవేస్తున్నారు. అవ్వా, తాతల పెన్షన్లు నిరంకుశంగా కట్ చేసి వారిని కూడా మోసం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల 11 వేల పింఛన్లున్నాయి. వాటిని వెయ్యి రూపాయలు చేస్తే నెలకు రూ.431 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 3,700 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అయితే బడ్జెట్ లో రూ. 1338 కోట్లు మాత్రమే పెట్టారు. అంటే అవ్వా, తాతల పెన్షన్లలో రూ. 2,400 కోట్ల కోత పెట్టారు.

ఇంత మోసం చంద్రబాబు ఒక్కడే చేయలేదు. ఈనాడు. ఆంధ్రజ్యోతి, టీవీ9 కలసి మోసపూరిత వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఐదేళ్ల తరువాత కూడా వీరు చంద్రబాబుకు కొమ్ముకాస్తారు. చంద్రబాబు మంచివాడే ఆర్బీఐ ఒప్పుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదంటూ ప్రచారం చేస్తారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి, తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ముత్తముల అశోక్ రెడ్డి, ఎమ్మెల్యేలు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్,  ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్ రాజు, జంకె వెంకట రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి, కొండేపి నియోజకవర్గాల ఇంఛార్జులు బుర్రా మధుసూదన్ యాదవ్, వరికూటి అశోక్, పార్టీ నేతలు కేవీ రమణా రెడ్డి, కుప్పం ప్రసాద్, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top