సీఎం నిస్సహాయతా.. వ్యూహమా?

హైదాబాద్‌, 1 సెప్టెంబర్‌ 2012: శుక్రవారం సాయంత్రం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్రాన్ని చుట్టుముట్టి వేధిస్తున్న ప్రధాన సమస్యలతో హోరెత్తి పోయింది.

రాష్ట్ర ప్రధాన సమస్యలు వేటిపైనా ప్రభుత్వానికి అదుపులేని కారణంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుస్థితిపై సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో తీవ్రంగా వాగ్వివాదాలు చోటుచేసుకొన్నాయి.

సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఇటీవల ఎన్నడూ లేనంతగా, చాలా సుదీర్ఘంగా సాగింది.

తమతమ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితి
నెలకొన్నదని మంత్రులంతా ముఖ్యమంత్రికి చెపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి కొద్దిరోజుల్లో చక్కబడుతుందంటూ సీఎం చెపుతున్న మాటలను వినిపించుకోలేదు. చిన్నచిన్న సమస్యలు తప్ప పరిస్థితి సజావుగా ఉందంటూ అధికారులు తమ సహజధోరణి సమాధానం వినిపించడం పట్ల మంత్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు.

విద్యుత్‌ సమస్య చర్చలో ముఖ్యమంత్రికి బదులు మరో మంత్రి కొండ్రు మురళి సమాధానం చెప్పడం, ఇతర మంత్రులకు ఆగ్రహం కలిగించింది. తను మాట్లాడుతుండగా జరిగిన ఈ పరిణామంతో మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి మనస్తాపం చెందారు. తనను అవమానించడానికే ముఖ్యమంత్రి ఈ విధంగా వేరే మంత్రితో సమాధానం చెప్పించారని భావించిన డీఎల్‌, ఆ వెంటనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. వేరే కార్యక్రమానికి హాజరు కావాలంటూ అంతకు ముందే సమావేశం మధ్యలో వెళ్లిపోయిన మంత్రి పితానిని, మంత్రుల విమర్శతో ముఖ్యమంత్రి వెనక్కు పిలిపించాల్సి వచ్చింది. కేంద్ర హోంమంత్రి షిండే వస్తున్నారంటూ కబురందడంతో సబితా ఇంద్రారెడ్డి కూడా ముందే వెళ్లిపోయారు.

రాష్ట్రాన్నిపట్టి కుదిపేస్తున్న విద్యుత్‌ సంక్షోభంతో పాటు ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, ఇసుక మాఫియా, భూముల కేటాయింపు విధానం, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక, గోదావరి తొలిదశ, కృష్ణా మూడోదశ, ప్రాణహిత-చేవెళ్ల, వృత్తి కళాశాలల నియంత్రణ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి వివిధ అంశాలపై మంత్రిమండలి వాడివేడిగా చర్చించింది.

చిట్టచివరకు .. విద్యుత్‌ సంక్షోభం అధిగమించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. భూముల కేటాయింపుపై కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. గోదావరి తొలిదశ, కృష్ణా మూడోదశ ప్రాజెక్టులకు హడ్కో రుణం పొందే అంశానికి ఆమోదం తెలిపింది. చేవెళ్ల-ప్రాణహిత అంతర్రాష్ట్ర ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. వృత్తి కళాశాలల నియంత్రణ ఆర్డినెన్స్‌కు, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్డడానికి కూడా ఆమోదం తెలిపింది. ప్రభుత్వ వివిధ శాఖల్లో పర్మనెంట్‌, ఔట్‌సో్ర్సింగ్‌ ద్వారా 12,864 పోస్టుల భర్తీకి కూడా అంగీకారం తెలిపింది.

 

Back to Top