వైయ‌స్‌ జగన్‌కు ప్ర‌ముఖుల ప‌రామ‌ర్శ‌


 హైదరాబాద్‌:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శనివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరామర్శించారు. వైయ‌స్‌ జగన్‌ను ప్రముఖ హీరో, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు చిరంజీవి ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి కూడా వైయ‌స్‌ జగన్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, వైయ‌స్‌ జగన్‌కు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు ఈరోజు మరోసారి పరీక్షలు నిర్వహించారు. వైయ‌స్‌ జగన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జరిగిన హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయ‌స్‌ జగన్‌ని శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసిన సంగతి తెలిసిందే. కత్తిపోటుకు గురై తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌లో చేర్పించగా.. డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ శివారెడ్డి, డాక్టర్‌ మధుసూదన్, డాక్టర్‌ జ్ఞానేశ్వర్‌లతో కూడిన వైద్య బృందం ఆయన ఎడమచేతి భుజానికి తొమ్మిది కుట్లు వేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రిలోనే ఉన్నారు. తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి వైయ‌స్‌ భారతి రోజంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. గాయానికి వేసిన కుట్లు చిట్లిపోకుండా ఉండేందుకు ఎడమ చేతికి సర్జికల్‌ బ్యాగ్‌ అమర్చారు.


Back to Top