హైదరాబాద్) అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాల మీద విషప్రచారం చేయటం కంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవటమే మేలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. మధ్యంతర ఎన్నికలకు వెళదాం రమ్మని ఆయన సవాల్ విసిరారు. ప్రజల్లోకి వెళదామని, అక్కడే తేల్చుకొందామని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాషాయ మాలలో ఉండి కసాయి వ్యక్తిలా ప్రవర్తించారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించటంపై చెవిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఎన్నిరకాలుగా వేధిస్తే, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడితే ఈ రకంగా కోపం వస్తుందని ఆయన నిలదీశారు. రోజమ్మను అనితమ్మ ఏ విధంగా దూషించారో, వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా ఏ విధంగా ప్రవర్తించారో తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేల తిట్లు, దూషణల వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేస్తే అందరికీ వాస్తవాలు తెలుస్తాయని అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీలో అంతా చూస్తుండగా, రికార్డుల్లో ఉండగానే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ..రేయ్ , నా కొడకల్లారా, అసెంబ్లీలో పాతేస్తా అని దూషిస్తే ఆయన మీద ఎటువంటి చర్య తీసుకోలేదని గుర్తు చేశారు. తెలుగుదేశం నాయకులకు ఒక రూలు, ప్రతిపక్షాలకు ఒక రూలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యులు గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ను తిడుతుంటే ఏమాత్రం అడ్డుకోవటం లేదని, కానీ..ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా, రూల్ పొజిషన్ చెబుతామనుకొంటున్నా కనీసం మైక్ ఇవ్వటం లేదని వాపోయారు. స్పీకర్ గా ఎన్నికైనప్పుడు కోడెల శివప్రసాద్ రావును తామెంతో గౌరవించామని గుర్తు చేశారు. స్పీకర్ స్థానం దాకా తోడ్కొని వెళ్లి మర్యాద చేశామని వివరించారు. అసెంబ్లీలో జరిగిన ప్రతీ విషయం మీద ఫుటేజ్ బయటకు విడుదల చేయాలని, వీటిని పరిశీలించేందుకు రెండు వైపుల నుంచి సమానసంఖ్యలో సభ్యుల్ని నియమించి పాత్రికేయుల సమక్షంలో చూపిద్దామని ప్రతిపాదించారు. తప్పు ఎవరు చేసినా శిక్షకు సిద్దంగా ఉన్నామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. కర్నాటక అసెంబ్లీలో అన్ని చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఉందని, ఇక్కడ మాత్రం ఒక్క చానెల్ కే అనుమతి ఇచ్చి కొంత మేరకే ఫుటేజ్ బయటకు ఇవ్వటం ఎంత మేరకు సబబని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ కూడా అదే పద్దతిని అనుసరిస్తే మేలని అన్నారు.