మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేయడానికి ప్రయత్నించారని, ఆయన 60 వేల అబద్ధాలతో బతుకు గడుపుతున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తనకు ఓటేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని, కుదువలో ఉన్న తాళిబొట్లు ఇంటికి వస్తాయని ఎన్నికల ముందు బాబు ఊదరగొట్టారని.. కానీ ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేసి ఉన్న ముక్కుపుడకలు, కమ్మలు కూడా కుదువ పెట్టేలా చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఆయన 60 వేల అబద్ధాలతో తమ జీవితాలు నాశనం చేశారని మహిళలు ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఒకప్పుడు మహిళలు వస్తుంటే ఆడపడుచులంటూ ఆదరించేవారని, కానీ ఇప్పుడు బ్యాంకులకు వెళ్తుంటే మహిళలను డిఫాల్టర్లుగా అవమానిస్తున్నారని, ఈ పరిస్థితి తెచ్చింది చంద్రబాబు కాదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు.<br/>డ్వాక్రా గ్రూపులు తానే ప్రారంభించానని చెప్పుకొనే చంద్రబాబు.. పాము తన గుడ్లు తానే తినేసినట్లు డ్వాక్రా గ్రూపులను సర్వనాశనం చేశారని రోజా అన్నారు. మహిళలు పొదుపు చేసుకున్న డబ్బు కూడా వడ్డీలకే కట్టేలా చేస్తున్నారని ఆమె తెలిపారు. వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు అశేష జనం వచ్చి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెబుతూ, చంద్రబాబు కారణంగా మోసపోయిన మీరంతా త్వరగానే మేల్కొన్నారని, సమరానికి సిద్ధమై.. మీకు జరగాల్సిన న్యాయాన్ని పొందాలని ఆమె ఆకాంక్షించారు.