రేవంత్‌రెడ్డి కేసులో చంద్రబాబుదే నైతిక బాధ్యత

గుంటూరు: తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విషయంలో
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నైతిక బాద్యత వహించి రాజీనామా
చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.
విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి కేసులో రేవంత్‌రెడ్డిని కాకుండా
చంద్రబాబుని ఏ- 1గా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరులో సోమవారం పార్టీ
గుంటూరు నగర ముఖ్య నేతలు, కార్యకర్తల విస్త్రృతస్ధాయి సమావేశం జరిగింది.


ముఖ్యఅతిథిగా హాజరైన విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం
అవినీతికి నిలువుటద్దం అని రేవంత్‌రెడ్డి విషయంలో మరోసారి
నిరూపితమైందన్నారు. నిత్యం తనంత అనుభవజ్ఞుడు, నీతిపరుడులేడని, అభివృధ్ధి తన
ద్వారానే సాధ్యపడుతుందని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు రేవంత్‌రెడ్డి
విషయంలో ఏం చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన
హమీల్లో ఒక్కటి కూడా అమలు జరపకుండా విజయయాత్రలు చేయటం హాస్యాస్పదంగా
ఉందన్నారు.


ఈ నెల 3, 4 తేదీల్లో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న దీక్షకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని
పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జననేత జగన్ ఏదైనా విషయంలో ఉద్యమం చేపడుతున్నారని
తెలియగానే, ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తోందని, అదే తరహలో ఆర్టీసీ
కార్మికుల సమ్మె సమయంలో జగన్ బంద్‌కు పిలుపునివ్వగానే వారికి ఫిట్‌మెంట్‌ను
అందజేశారని గుర్తు చేశారు.


నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ టిడిపి నేతల గుండెలు గుభేలు
మనేలా దీక్షకు ప్రజలు తరలిరావాలని కోరారు. అధికారం చేతిలో ఉంది కదా అని
కార్యకర్తల జోలికోస్తే సహించేది లేదని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గ
ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు తమ కోసం
జగన్ చేపడుతున్న దీక్షకు మద్దతునిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో
పార్టీ వివిధ విభాగాల నేతలు  కావటి మనోహర్‌నాయుడు, పోలూరి వెంకటరెడ్డి,
రాతంశెట్టి రామాంజనేయులు, షేక్ ఖాజావలి, శిఖా బెనర్జీ, పానుగంటి చైతన్య,
దేవరాజు, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, అంగడి శ్రీనివాసరావు, చింకా
శ్రీనివాసరావు, మండేపూడి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Back to Top