చంద్రబాబును పట్టిస్తే.. 10 లక్షలు: లక్ష్మీపార్వతి

కళ్యాణదుర్గం/ కుందుర్పి (అనంతపురం), 9 అక్టోబర్ 2012: చంద్రబాబు చేస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ప్రజల బాగు కోసం కానే కాదని, ఆయన కుమారుడు లోకే‌ష్‌కు రాజకీయ వారసత్వాన్ని కట్టబెట్టడానికే అని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. రచ్చబండ- పల్లెనిద్ర ముగింపు సందర్భంగా సోమవారం వైయస్‌ఆర్‌ సిపి నాయకుడు ఎల్‌.ఎం. మోహన్‌రెడ్డి అధ్యక్షతన కుందుర్పిలోని‌ దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆమె మాట్లాడారు.

చంద్రబాబు కుమారునికి టిడిపి పగ్గాలు అప్పగించేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంగీకరించరని, పాదయాత్ర ముసుగులో బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నాడన్నారు. ‘లొసుగులను అడ్డం పెట్టుకుని చట్టం కళ్లు ‌కప్పి తిరుగుతున్న చంద్రబాబును పట్టిస్తే రూ.10 లక్షలు బహుమతిగా ఇస్తాన'ని లక్ష్మీపార్వతి ప్రకటించారు. 'చంద్రబాబు ప్రస్తుతం మీ జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నాడు. పట్టుకుని కట్టేయండ’ని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

1994లో ఎన్టీఆర్ రాష్ట్రంలో పర్యటించి పార్టీని అధికారంలోకి తీసుకురాగా ఆరు నెలల్లోనే బాబు వెన్నుపోటు పొడిచారని, చివరకు మామ మరణానికి కారకుడయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొంత మామ ప్రాణాలు తీసిన వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తాడు? తొమ్మిదేళ్లు పేదలకు అన్నం పెట్టని నీవు ఇప్పుడు పెడతానంటే ప్రజలు నమ్ముతారా.. సొంత అత్తకు ఇల్లు లేకుండా చేసిన నీవు ప్రజలకు ఇళ్లు ఇస్తానంటే నమ్మేదెలా’ అని లక్ష్మీపార్వతి నిలదీశారు.
Back to Top