'చంద్రబాబు కార్మికుల కడుపుపై కొట్టారు'

అనంతపురం

: జిల్లాలో కార్మికుల కడుపుకొట్టిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబుదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ ట్రేడ్ యూనియన్ అనుబంధ ఆటో యూనియన్ నగర  అధ్యక్షుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో డ్రైవర్సు కాలనీ, అజాద్ ఫంక్షన్‌ హాలు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ ఆటోస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ఆటోయూనియన్ నాయకులు షెక్షావలి, చౌడప్ప, రెహమాన్, షాషావలీ తదితరులతో పాటు మరికొందరు ఆటో కార్మికులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ... సీఎంగా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు జిల్లాలో ఉన్న అనేక పరిశ్రమలను మూతేసి కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. హిందూపురం నిజాం చక్కెర ఫ్యాక్టరీ, గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు, పెనుకొండ ఆల్విన్‌ ఫ్యాక్టరీ,  తాడిపత్రి ఎర్రగుంట కాటన్‌ మిల్లు... తదితర పరిశ్రమలను నష్టాల పేరు చెప్పి లాకౌట్ చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హైటెక్ హయాంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు, పెన్షనర్లు... ఇలా అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి కార్మిక వర్గాల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేశారన్నారు. అదే స్ఫూర్తితో జననేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రానున్న కాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షపాతిగా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. కార్మికుల ద్రోహిగా చరిత్రకెక్కిన చంద్రబాబు ఇపుడు మభ్యపెట్టే మాటలతో పాదయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోసారి అవకాశం ఇస్తే అన్ని వర్గాలను ఇబ్బందుల్లోకి నెట్టేయడం ఖాయమన్నారు. విజ్ఞులైన ప్రజలు ఇప్పటికే చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్పారని, రానున్న కాలంలో కూడా టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు.

తాజా వీడియోలు

Back to Top