బెయిల్ పిటిషన్ 24కు వాయిదా

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రాష్ట్ర హైకోర్టు ఈనెల 24(సోమవారం)కు వాయిదావేసింది. సీఆర్‌పీసీ 167(2) సెక్షన్ కింద తనకు బెయిలు మంజూరు చేయాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత 90 రోజుల గడువులోపల సీబీఐ చార్జిషీటు దాఖలు చేయలేదని అందులో కోర్టు దృష్టికి తెచ్చారు.  బుధ, గురువారాలలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బి. శేషశయన రెడ్డి తీర్పును సోమవారానికి వాయిదావేశారు. వాదనలు వినడానికి ముందు సీబీఐ, శ్రీ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్లను న్యాయమూర్తి పరిశీలించారు.
     వాదనల సందర్భంగా వ్యాన్‌పిక్ కేసులో శ్రీ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారన్న సీబీఐ వాదనతో న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, పద్మనాభ రెడ్డి విభేదించారు. బుధవారం నాటి సీబీఐ వాదనలో శ్రీ జగన్మోహన్ రెడ్డిని వ్యాన్‌పిక్ కేసులో అరెస్టు చేశామనీ, మిగిలిన కేసులలో విచారణ పూర్తికావల్సి ఉందనీ తెలిపింది. కాబట్టి బెయిలు ఇవ్వరాదని సీబీఐ న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు.
     సెప్టెంబరు 26న జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ఎదుట చేసి వాదనలో వ్యాన్‌పిక్ కేసులో శ్రీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పాత్రా లేదని చేసిన వాదనకూ ఈ వాదనకూ పొంతన లేకుండా ఉంది.
     తన పిటిషనర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు సుప్రీం కోర్టులో 167(2) సెక్షన్ కింద స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని పద్మనాభరెడ్డి స్పష్టంచేశారు. ఇలాంటి పిటిషను మీద సుప్రీం కోర్టులో ఎలాంటి వాదనలూ జరగలేదని కూడా పేర్కొన్నారు. అప్పటికి 90 రోజుల గడువు పూర్తికానందున పిటిషన్ వేయలేదన్నారు. సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేసిన నాటికి ఈ గడువు ముగియలేదని వివరించారు. ఈ విషయంలో కోర్టును సీబీఐ న్యాయవాది తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన వివరించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, రిమాండులకు సంబంధించిన నివేదికలను హైకోర్టుకు సమర్పించారు. వాటిలో వ్యాన్‌పిక్ ప్రస్తావన లేదనీ తద్వారా కోర్టును తప్పుదారి పట్టిస్తున్న అంశం వెల్లడవుతోందన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి కోర్టు బెయిలు నిరాకరించేందుకే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు.

     శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఏ కేసులో అరెస్టు చేసిందీ.. ఏఏ కేసుల్లో విచారణ సాగుతున్నదీ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారా లేదా అనే అంశంపై జస్టిస్ శేషశయన రెడ్డి బుధవారం సీబీఐ న్యాయవాదిని ప్రశ్నించారు.

Back to Top