బాబుకు బాధ్యత ఉందా? : డి.ఎ. సోమయాజులు

హైదరాబాద్‌, 30 ఆగస్టు 2012 : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు ప్రముఖ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి కావడంతో టి.డి.పి. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కేంద్ర పాలక మండలి సభ్యులు కొణతాల రామకృష్ణ, డి.ఎ. సోమయాజులు ఆరోపించారు. ఆ మీడియా సంస్థల సర్వేలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనాన్ని స్పష్టం చేస్తున్నాయని వారు వ్యాఖ్యానించారు. డబ్బులిచ్చి సర్వేలు చేయించారన్న వ్యాఖ్యలు చంద్రబాబు బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట అని రామకృష్ణ, సోమయాజులు దుయ్యబట్టారు. మీడియా సర్వేల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తక్షణమే మీడియాకు, జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నోటికి వచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడడం తగదని రామకృష్ణ, సోమయాజులు హితవు పలికారు. సర్వే ఫలితాలతో బాబు దిమ్మతిరిగిపోయిందని అన్నారు. 2009 తరువాత ఇప్పటి వరకూ జరిగిన 75 ఉప ఎన్నికల్లో టిడిపి ఒక్క సీటు కూడా గెలవలేదని వారు గుర్తు చేశారు. పైగా కొన్ని చోట్ల ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని కొణతాల, సోమయాజులు ఎద్దేవా చేశారు.

1989 నుంచి పలు మీడియా సంస్థలు దేశంలో ఒక్కో సమయంలో ఒపీనియన్‌ పోల్పు నిర్వహిస్తున్నాయన్నారు. అలా ఎన్డీటీవీ తాజా సర్వేలో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే ఫలితాలు జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉంటాయని వెల్లడైందన్నారు. 2011 లోనూ పలు సర్వేలు ఇలా వచ్చాయన్నారు. గత ఏడాది ఆగస్టులో హిందూ, సీఎన్‌ఎన్‌- ఐబీఎన్‌ చానళ్ళు సర్వే చేశాయన్నారు. ఆ ఫలితాలు కూడా సుమారు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. ఇటీవల ఇండియా టుడే, ఎన్డీటీవీలు 'మూడ్‌ ఆఫ్‌ ది నేషన్'‌ పేరిట నిర్వహించిన సర్వే కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మెజార్టీ లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించాయని కొణతాల, సోమయాజులు తెలిపారు. ఈ సర్వేపై చంద్రబాబునాయుడు అవాకులు చెవాకులు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. నాలుగు రాష్ట్రాల్లోనే ఎన్డీటీవీ ఎందుకు సర్వేలు నిర్వహించిందని బాబు ప్రశ్నించడంలోనే ఆయన విజ్ఞత వెల్లడవుతోందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మాట్లాడడం సరికాదన్నారు.జగన్మోహన్‌రెడ్డి నుంచి రూ. 30 కోట్లు తీసుకుని ఆయనకు అనుకూలంగా సర్వే ఫలితాలు రూపొందించారని చంద్రబాబు నాయుడు ఆరోపించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని సోమయాజులు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌ బలంగా ఉందని కూడా ఆ సర్వేలో వెల్లడైనందున ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఎన్ని కోట్లు ఇచ్చారో బాబు వెల్లడించాలన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా మీడియా సంస్థలకు ఉన్న విశ్వసనీయత దెబ్బతినవచ్చేమో కాని టిడిపికి ఒనగూరే లాభం ఏదీ ఉండదన్న విషయాన్ని గ్రహిస్తే మేలు అని సోమయాజులు సలహా ఇచ్చారు.

Back to Top