అటకెక్కిన ఆరోగ్యశ్రీ

మల్దకల్, (మహబూబ్ నగర్ జిల్లా):

దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర 41వ రోజు పాలమూరు జిల్లాలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మల్దకల్ మండలంలోని పెద్దపెల్లి గ్రామంలో షర్మిల రచ్చబండ కార్యక్రమానికి సమీప గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వృద్ధులకు, వికలాంగులకు, అంధులకు పింఛన్లు రావడంలేదని రచ్చబండలో పాల్గొన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాలు ఇస్తామన్న సీఎం కిరణ్ పావలా వడ్డీ రుణాలు కూడా లేకుండా చేశారని మండి పడ్డారు. నిరు పేదలు సంజీవనిగా భావించే ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని అటకెక్కించారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల తాము ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత అధికారంలో ఉన్నప్పుడు తాము ఎంతో సంతోషంగా కాలం గడిపామని గుర్తు చేసుకున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని వారు ఆకాంక్షించారు. తాము ఎప్పుడూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటామని అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఆరో రోజు షర్మిల పాదయాత్ర 15 కిలో మీటర్లు కొనసాగనుంది. ఇప్పటి వరకు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో షర్మిల పాదయాత్ర పూర్తి చేశారు. పాలమూరు జిల్లాలో తన ఐదో రోజు సోవవారం నాటికి షర్మిల పాదయాత్ర 539.10 కిలో మీటర్లు కొనసాగింది.

Back to Top