బాబు బాధ్యతారహితం వల్లే ఈ గతి

రాష్ట్రం అట్టుడుకుంతే చంద్రబాబు దుబాయ్‌ వెళ్తారా..?
బీజేపీతో మిత్రపక్షంగా ఉండి ఏం సాధించావ్‌ బాబూ
ప్రజల వ్యతిరేకతను బీజేపీపై నెట్టేందుకు కుట్ర
బంద్‌లో పాల్గొని విజయంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌: చంద్రబాబు బాధ్యతారహిత్యం వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలంతా రోడ్డెక్కితే.. చంద్రబాబు విమానం ఎక్కి దుబాయ్‌కు వెళ్లారని మండిపడ్డారు. హక్కుల సాధన కోసం రాష్ట్రం అట్టుడికి పోతుంటే పెట్టుబడులు తీసుకురావడానికి దుబాయ్‌కి వెళ్లడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో మిత్రపక్షంగా ఎందుకని అడిగితే.. రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి మిత్రపక్షంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. మిత్రపక్షంగా ఉండి నాలుగేళ్లు గడుస్తుంది ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం సాధించావు చంద్రబాబూ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు ఒక్కటి కూడా సాధించలేకపోయాడని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్ర ప్రభుత్వం సంకీర్ణ ధర్మం పాటించడం లేదంటున్నారని, మొదటి నుంచి కేంద్రం సంకీర్ణ ధర్మానికి విరుద్ధంగా ఉన్నా టీడీపీ గమనించలేదన్నారు. 

చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ. లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యారని బీజేపీ ఎమ్మెల్సీ వేసిన ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటని అంబటి ప్రశ్నించారు. గల్లా జయదేవ్‌ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబేనని గల్లా జయదేవ్‌ తెలుసుకోవాలన్నారు. పంపిస్తున్న ఫండ్స్‌లో బాబు కమీషన్‌లు తీసుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ పెద్దలే చెప్పారన్నారు. అదే విధంగా ప్రతిపక్షం కూడా చంద్రబాబు దోపిడీని ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో పుస్తకం ఆధారాలతో సహా ప్రచురించి పంచడం జరిగిందన్నారు. జీఎస్టీ వచ్చిందని ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని చెబితే ప్యాకేజీకి అంగీకరించాం అని సుజనా చౌదరి చెప్పడంపై అంబటి విరుచుకుపడ్డారు. హోదాను వద్దని చెప్పడానికి నువ్వెవరు.. నీకే హక్కు ఉందని సుజనా చౌదరిని ప్రశ్నించారు. 

ఆంధ్రరాష్ట్ర ప్రజలు బీజేపీ, టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉండడంతో బీజేపీపై తప్పు వేసి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర అంతా వాడుకోవడం.. వదిలేయడమేనని చెప్పారు. సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్, పవన్‌కల్యాణ్, బీజేపీతో జతకట్టి గెలవడం పబ్బం గడిచిన తరువాత వదిలేయడం చంద్రబాబు రాజకీయ నైజమన్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఇప్పుడు మళ్లీ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన విషయాలను సీరియస్‌గా తీసుకోరని, ఓటుకు కోట్ల కేసు, అసెంబ్లీ సీట్ల పెంపు, కమీషన్‌ల విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటాడన్నారు. రూ.3,75,008 కోట్లు కమీషన్‌ల ద్వారా సంపాదించినట్లు చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు నిర్లక్ష్యం మూలంగానే విభజన హక్కులు సాధించలేకపోయారన్నారు. కేంద్రంతో భాగస్వాములుగా ఉండి నాటకాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌లో పాల్గొన్న అందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున అంబటి కృతజ్ఞతలు తెలియజేశారు. 

తాజా వీడియోలు

Back to Top