ఆయనది పోజుల యాత్ర

కళ్యాణదుర్గం:

మహానేత వైయస్‌ఆర్ పేదల కష్టాలను తెలుసుకునేందుకు పవిత్రమైన పాదయాత్రను చేపడితే, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోజుల కోసం పాదయాత్ర చేపడుతున్నాడని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ములకనూరు గోవిందు, గోళ్లసూరి, లక్ష్మినారాయణ, పట్టణ కన్వీనర్ దాదా ఖలందర్, మైనార్టీ కన్వీనర్ జీఎం ఖాన్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గొర్రెపిల్లలను ఎత్తుకోవడం, చిన్నపిల్లలను ముద్దాడటం, నాగలి మోయడం చేస్తూ ఫోజులిస్తున్నారు తప్ప, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయడం లేదన్నారు. వైఎస్‌ఆర్ విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టించి వివాదాలు సృష్టిస్తున్నారని, నేర చరిత్రగల చంద్రబాబు తొమ్మిదేళ్లు జిల్లాలో ఊచకోత కోయించారని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్ సీఎం అయ్యాక కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఫ్యాక్షన్‌ను తగ్గించారన్నారు. అలాంటి ఆయనను పేదలు మరవలేదని, స్వచ్ఛందంగా విరాళాలతో విగ్రహాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తుంటే, బాబు ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పట్ల కాంగ్రెస్ నాయకులు కూడా అదే తరహాలో వ్యవహరిస్తూ సహకరిస్తున్నారన్నారు.

Back to Top