2నుంచి విజయమ్మ నిరవధిక దీక్ష

హైదరాబాద్, 01 ఏప్రిల్ 2013:

విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగనుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. హైదరాబాద్ ఆదర్శ నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులో ఈనెల రెండున మంగళవారం నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. ఉదయం లోటస్ పాండ్‌లో ఉన్న విజయమ్మ నివాసం నుంచి అంతా బయలుదేరి పంజగుట్టలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం విద్యుదుద్యమ  అమరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, దీక్ష స్థలికి వెళ్ళి, నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఈ వివరాలను సోమవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


అధికారంపై తాపత్రయమే తప్ప ప్రజాశ్రేయం మరిచారు

కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగేళ్ళలో అధికారంలో ఉండి, నీరో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తోందని కొణతాల ఆరోపించారు. అధికారాన్ని నిలుపుకోవాలనే తాపత్రయంతో ప్రధాన ప్రతిపక్షంతో కుమ్మక్కయ్యి, ప్రజా సమస్యలను విస్మరించిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పాలనకు ఇది కొనసాగింపుగా తోస్తోందన్నారు. విపరీతమైన కోతలతో రాష్ట్రం ప్రస్తుతం అతలాకుతలమవుతోందన్నారు. బొగ్గు, గ్యాస్, నీటి వనరులు అందుబాటులో లేక  ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. జలవిద్యుదుత్పత్తికి అవసరమైన హైడ్రో పవర్ ప్రాజెక్టులలో నీరు తగ్గిపోవడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. నీటి ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోకుండా..  బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసిపోయిన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు నిర్మించే యత్నం చేయలేదని చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు. ఈలోగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎగువన నీటి ప్రాజెక్టులు నిర్మించేసుకున్నాయనీ, తత్ఫలితంగా మనకి కటకట నెలకొందనీ చెప్పారు. ప్రాజెక్టులను స్వేచ్ఛగా కట్టుకునే వెసులుబాటు కల్పించారన్నారు. ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవడం లేదని ఆమన ఆరోపించారు. ఇప్పటికే మూడు వేల మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యముందని కొణతాల పేర్కొన్నారు. ఉన్న వనరులను వినియోగించుకోలేని అసమర్థ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు.


అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే చార్జీల పెంపు ఉండేది కాదు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఆందోళనలతో హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బడ్జెట్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందేనన్నారు. తెలుగు దేశం పార్టీ స్పందించకపోవడంతో అది వీగిపోయిందన్నారు. విద్యుత్తు వినియోగదారులపై 6500 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోపడానికి ఇదే కారణమన్నారు.  చంద్రబాబు ఇప్పుడు కాకినాడలో నిరాహార దీక్ష చేస్తున్నారనీ, దీనిబదులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి ఉంటే చార్జీల పెంపు పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని కొణతాల అభిప్రాయపడ్డారు.


ప్రభుత్వ పనితీరుకు ఈ గణాంకాలు చాలు

ఓపక్క వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయాయన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో రెండు కోట్ల ఏడు లక్షల టన్నులు ఉత్పత్తయ్యాయనీ, ఇప్పడు మళ్లీ తెలుగుదేశం హయాంలో మాదిరిగా 16౦కోట్ల టన్నులకు దిగజారిపోయిందనీ ఆవేదన వ్యక్తంచేశారు. పారిశ్రామిక ఉత్పత్తి 13 నుంచి -6.4 శాతానికి పడిపోయిందన్నారు. ప్రభుత్వ పనితీరు చెప్పడానికి ఈ గణాంకాలు చాలునని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రం అన్నిరకాలుగా ఇబ్బందిపడుతోందన్నారు.


మొండితనాన్ని అభివృద్ధి చేసేందుకు చూపండి

రబీ పంటకు విద్యుత్తును ఇచ్చే ఆలోచన లేదని సీఎం ప్రకటించడం ఎంతవరకూ సబబని కొణతాల ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్తు లేదా రైతాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా తమ పార్టీ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. భూగర్భ జలం అందుబాటులో లేదు కాబట్టి.. ఏడు గంటల విద్యుత్తు అవసరం లేదనీ, నాలుగు గంటలిస్తే సరిపోతుందనీ సీఎం చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నేను మొండివాణ్ణనీ, ఎటువంటి నిర్ణయమయినా తీసుకుంటాననీ చెప్పిన ముఖ్యమంత్రి తన మొండితనాన్ని అభివృద్ధిలో చూపించాలని కొణతాల హితవు పలికారు. వ్యవసాయోత్పత్తులను పెంచడంలోనూ, లేదా గ్యాస్ రప్పించడంలోనూ ఆ మొండితనం చూపాలని కోరారు. ముఖ్యమంత్రి కేంద్రానికి దాసోహమైనందునే ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు.  విద్యుత్తు అంశంపై కాంగ్రెస్ నేతలు అందరూ తలోరకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్తు భారాన్ని ప్రభుత్వమే మోసేలా చర్య తీసుకోవాలని  ప్రజల పక్షాన కోరుతున్నామన్నారు. అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు పాలన నెంబరు 2లా ఉందన్నారు. మేకవన్నెపులుల్లా నటించడం ఆపి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. అవిశ్వాసం పెట్టినప్పుడు రెండు పార్టీలనుంచి తొమ్మిదిమంది చొప్పున అనుకూలంగా ఓటేయడం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చెబుతోందని పేర్కొన్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన వారి సభ్యత్వాలను రద్దుచేయించే పనిలో ఆ పార్టీలు ఉన్నాయి తప్ప వాస్తవం తెలుసుకోవడం లేదని చెప్పారు. తీసుకుంటున్న నిర్ణయాలను సమీక్షించుకోవాలన్నారు. ఆదాయం పెరుగుతున్నప్పటికీ అవసరాలను తీర్చే చర్యలు చేపట్టడం లేదన్నారు. పైగా భారాన్ని మొత్తం ప్రజలపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. ముప్పై లక్షల ఎకరాలకు నీరిస్తామని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పూర్తికావడానికి దగ్గరలో ఉన్న 20 ప్రాజెక్టులను సైతం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రతి రంగం తిరోగమనంలో ఉందని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకిస్తూ తమ పార్టీ నిరవధిక దీక్ష చేపట్టాలని రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందన్నారు. తమ దీక్షకు సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. వీటితో పాటు ఇదివరలో ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. నాలుగు సంవత్సరాల్లో 32 వేల కోట్లు వసూలు చేసి వెయ్యి కోట్ల రూపాయలు తగ్గిస్తామని సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కొణతాల ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు.

Back to Top