12న వైఎస్సార్‌సీపీలోకి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి

పీజేఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె పి.విజయారెడ్డి ఈనెల 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ఉదయం 9 గం టలకు ఖైరతాబాద్‌లోని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడ నుంచి భారీ ఊరేగింపుతో వెళ్లి వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆమె వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరబోతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన తండ్రి పీజేఆర్ చేసిన సేవలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. అయితే ఆయన ఆశయాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, నియోజకవర్గంలో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయిందని విమర్శించారు. పీజేఆర్ కుటుంబ సభ్యులు ఖైరతాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించాలని నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారని, దీనిపై గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పారు. తన తండ్రి పీజేఆర్ ఆశయాలు అమలు కావాలంటే అందుకు యువరక్తం నింపుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసలైన వేదిక అని స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

Back to Top