అమరావతి: రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. మేనిఫెస్టోను పవిత్రగ్రంథంగా భావించి హామీలు అమలు చేస్తున్నారని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో నారాయణస్వామి ఏపీ వాల్యూయాడెడ్ ట్యాక్స్ బిల్లు-2020ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ బిల్లు సహజ వాయువులు, పెట్రోల్, డీజిల్‌పై విధించిన పన్నును సవరిస్తూ జారీ నోటిఫికేషన్ ద్వారా సరిచేస్తూ శాసనం ద్వారా క్రమబద్ధీకరించి చట్టంలో పొందుపరచడానకి ఉద్దేశించింది. ఇందులో 14.5 శాతం నుంచి 25.5 శాతానికి పన్ను పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తూ షెడ్యూల్‌ను సవరిస్తున్నాం. డీజిల్‌పై లీటర్ రూ.2.70 పైసల నుంచి రూ.4 వరకు సవరణ చేస్తున్నాం. పెట్రోల్‌పై కూడా అదనంగా రూ.4 పెంచడానికి కోవిడ్-19 పరిస్థితుల కారణంగా సవరణ చేస్తున్నాం. అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ఈ పన్ను ఉపయోగించనున్నాం. ఏడాదికి రూ.500 కోట్లు అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేశామని చెప్పారు. ఏపీ వాల్యూయాడెడ్ ట్యాక్స్ బిల్లును ఆమోదిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.