లోకంలో అన్యాయం పెరిగిపోయింది.గుట్టు చప్పుడు కాకుండా ఓ నలుగురు ఎమ్మెల్యేలు ఓట్లను న్యాయంగా కోట్ల రూపాయలు పోసి కొందాం అనుకుంటే..........అందరూ కలిసి కుట్ర చేసేశారు. చాటుమాటుగా ఫోన్లో మాట్లాడుకుంటే చెవులు రిక్కించి వినేశారు. అది సంస్కారం కాదని తెలిసి కూడా ఘాతుకానికి పాల్పడ్డారు. వినడమే ఘోరం అనుకుంటే ఆ విన్నదంతా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వినిపించేలా చేశారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ కాబోయే జాతీయ పార్టీ అధ్యక్షుడు .. తనకు నమ్మకస్తుడైన తన పార్టీ ఎమ్మెల్యేకి డబ్బులిచ్చి ఎవరూ చూడని వేళ కేవలం దొంగలు మాత్రమే సంచరించే నిశీది వేళ ఓ నామినేటెడ్ ఎమ్మెల్సీని బేరమాడ్డానికి పంపితే అత్యాధునిక కెమెరాలు పెట్టి సినిమా షూటింగ్ చేసినట్లు రికార్డు చేశారు. లోకంలో ఇంతకన్నా అన్యాయం ఇంత కన్నా దారుణం ఇంతకన్నా పాతుకం మరోటి ఉంటుందా.....?<br/>ఈ కుట్రలు తట్టుకోలేక ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె రగిలిపోతోంది...అవమానంతో కాలిపోతోంది. ప్రతీకార వాంఛతో మండిపోతోంది. ముఖ్యమంత్రిని ఉమ్మడి రాజధానిలో రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని ప్రజలందరూ చూస్తుండగా బోనెక్కించడం ద్వారా తెలుగు రాష్ట్ర అభివద్ధిని అడ్డుకోవాలని కుట్ర పన్నారు.ముఖ్యమంత్రులన్న తరువాత ఫోనులో ఎవరెవరితోనో...........ఏవేవో విషయాలు మాట్లాడుకుంటారు. అవసరమైనపుడు ఫోన్లోనే కోట్లు పెట్టి ఓట్లు కొనుక్కుంటారు. లేదంటే అంతకుమించిన దగుల్బాజీ పని చేస్తారు.వాడిని అడ్డుకోడానికి అధికారులు ఎవరు? పొరుగు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు? అసలు ఈ దొంగ పనంతా ప్రసారం చేయడానికి టీవీ వాళ్లు ఎవరు?<br/>పెద్దల దొంగతనం గుట్టురట్టు చేసే అధికారం పేపర్లకు, టీవీలకు కూడా లేదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. తాము చూసిన రేవంత్‌రెడ్డి, తాము విన్న చంద్రబాబునాయుడు అవినీతి వ్యవహారాలు తాము చూడనే లేదని ప్రకటించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి దారి తప్పి తప్పుడు పనులు చేస్తే చూసీ చూడనట్లు వదిలేయాలని నిసిగ్గుగా విఙ్ఞప్తి చేసుకుంటున్నారు.<br/><br/>- కవి కాకి